ఆప్ కిచ్చిన రూ 100 కోట్ల ముడుపులపై కవితపై ప్రశ్నల వర్షం

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితురాలిగా భావించి అరెస్ట్ చేసి, వారం రోజుల పాటు తమ కస్టడీలోకి కోర్టు ద్వారా తీసుకున్న  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఈడీ అధికారులు  ఆప్ కు చెల్లించిన రూ 100 కోట్ల ముడుపుల గురించి ప్రధానంగా ప్రశ్నల వర్షం కురిపించిన్నట్లు తెలిసింది. కస్టడీలో భాగంగా తొలి రోజు ఆదివారం కవితను ఈడీ అధికారులు కోర్టు ఆదేశాల మేరకు ఉదయం 10 నుంచి 5 గంటల వరకు విచారణ జరిపారు. 

ఆ విచారణ మొత్తాన్ని కూడా వీడియో తీశారు. ఈ విచారణలో భాగంగా  ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో టెండర్ల కోసం ఆప్ ప్రభుత్వానికి ఇచ్చిన రూ.100 కోట్ల ముడుపులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ డబ్బు ఎవరెవరు సమకూర్చారని కవితను ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం.  రూ.100 కోట్లకు సంబంధించిన లావీదేవీలకు సంబంధించిన వివరాలు ముందు పెట్టి..  కవితను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. 

మరోవైపు ఈ లిక్కర్ స్కాం లావాదేవీలలో సంపాదించిన రూ.192  కోట్లను ఏం చేశారని, ఆ డబ్బంతా ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారని ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఈ ప్రశ్న అడిగినప్పుడు కూడా కవిత కొనుగోలు చేసిన ఆస్తి పత్రాలు ముందుంచి ఈడీ ప్రశ్నించినట్టు సమాచారం. అయితే ఈడీ అధికారులు సంధించిన ప్రశ్నల్లో కవిత కొన్నింటికి మాత్రమే సమాధానాలు ఇచ్చిందని, మరికొన్నింటికి మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

 పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే కవితను ఈడీ అధికారులు ధైర్యంగా అరెస్ట్ చేశారని, వాటిని ముందు పెట్టే విచారణ కొనసాగించనున్నారని తెలుస్తోంది. ఇక మిగితా రోజుల్ ఆమె గురించి సమాచారం ఇచ్చిన, ఈ స్కాంలో భాగస్వామ్యమైన వ్యక్తులను ప్రత్యక్షంగా ముందు కూర్చోబెట్ విచారించనున్నట్టు సమాచారం.

ఇదిలా ఉంటే తొలిరోజు కస్టడీ అనంతరం 6 నుంచి 7 గంటల మధ్యలో కవితను ఆమె భర్త అనిల్, కేటీఆర్, హరీష్ రావులతో పాటు న్యాయవాది కూడా ములాఖాత్ అయ్యారు. ఈ ములాఖాత్‌తో తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని కవిత నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కవిత భర్త అనిల్ సుప్రీం కోర్టులో కంటెప్ట్ అఫిడవిట్ దాఖలు చేయనున్నారు.