మహాదేవ్‌ యాప్‌ కేసులో మాజీ సీఎం బఘేల్‌

ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌ చిక్కుల్లోపడ్డారు. మహాదేవ్‌ యాప్‌ కేసులో రాయ్‌పూర్‌ ఆర్థిక నేరాల విభాగం బఘేల్‌తో పాటు పలువురి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఐపీసీ 120బీ, 34, 406, 420, 467, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదైంది. మార్చి 4న భూపేష్ బఘేల్, మరో 21 మందిపై కేసు నమోదు నమోదు చేశారు. 
 
మాజీ సీఎంపై బఘేల్‌పై పోలీసు ఎఫ్‌ఐఆర్‌లో, మోసం, నేరపూరిత కుట్ర, నమ్మక ద్రోహం, ఫోర్జరీకి సంబంధించి ఐపీసీలో వివిధ సెక్షన్ల కింద అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 7, 11 కింద అభియోగాలు మోపారు.   మహదేవ్ యాప్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసుపై ఈడీ ఏడాదిగా విచారణ జరుపుతోంది. 
 
ఈ కుంభకోణంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఉన్నత స్థాయి రాజకీయనేతలు, అధికారుల ప్రమేయం ఉందని ఈడీ ఆరోపిస్తోంది. బెట్టింగ్ యాప్‌ను రూపొందించేందుకు అప్పట్లో సీఎంగా ఉన్న భూపేష్ బఘెల్ తనను ప్రోత్సహించారని, ఆయనకు రూ.508 కోట్లు చెల్లించామని యాప్ ఓనర్ శుభమ్ సోనీ విచారణ సమయంలో సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను బఘెల్ గతంలో తోసిపుచ్చారు.
 
ఫిబ్రవరిలో ఈ కేసులో కేంద్ర ఏజెన్సీ తొమ్మిది మందిని అరెస్టు చేసింది. యాప్ ద్వారా వచ్చిన అక్రమ సొత్తును ఛత్తీస్‌గఢ్‌లోని రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్‌లకు లంచాలు ఇచ్చేందుకు వినియోగించినట్లు ఏజెన్సీ గతంలో పేర్కొంది. ఈ యాప్‌ కేసులో బాలీవుడ్‌ నటులతో సహా పలువురు ప్రముఖలను విచారించారు. బెట్టింగ్, గేమింగ్ యాప్‌ ఇద్దరు ప్రమోటర్లు సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్‌పై సహా ఇప్పటివరకు ఈడీ రెండు ఛార్జిషీట్లను దాఖలు చేసింది.
 
కాగా, తనపై ఆర్థిక నేరాల విభాగం తాజాగా కేసు నమోదు చేయడాన్ని భూపేష్ బఘెల్ తప్పుపట్టారు. 2021 నుంచి ఈటీ, ఈడీ, సీబీఐ ఇదే పనిమీద ఉన్నాయని, అన్ని ప్రాంతాల్లోనూ దాడులు జరిపి, తన పేరు చేర్చేందుకు ప్రతి ఒక్కరిని బెదిరించాయని, కానీ ఏమీ చేయలేకపోయాయని తెలిపారు.