వారం రోజుల ఈడీ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కేసులో ఈడీ గత రాత్రి హైదరాబాద్ లోని ఆమె ఇంటివద్ద అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కవితకు రౌస్‌ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడికి అనుమతించింది. ఈ నెల 23 వరకు కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి రోజు కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు కోర్టు అవకాశం కల్పించింది.
 
 ప్రతిరోజు లాయర్లను కలిసేలా వీలు కల్పించింది. అదే సమయంలో ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు కవితకు అవకాశం ఇచ్చింది. ఈ నెల 23న మధ్యాహ్నం కోర్టులో హాజరుపరుచాలని ఈడీని ఆదేశించింది. సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీని దర్యాప్తు సంస్థ ఈడీ ఉల్లంఘించిందని ఎమ్మెల్సీ కవిత న్యాయవాది విక్రమ్‌ చౌదరి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 
 
హామీని ఉల్లంఘించి అరెస్టు చేశారని తెలిపారు. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు రౌస్‌ అవెన్యూ కోర్టులో శనివారం హాజరుపరిచారు. సీబీఐ స్పెషల్‌ జడ్జీ ఎంకే నాగ్‌పాల్‌ ముందు ఎమ్మెల్సీ కవిత తరఫు లాయర్‌ విక్రమ్‌ చౌదరి, మోహిత్‌ రావు, ఈడీ తరఫున జోయబ్‌ హుస్సేన్‌, ఎన్‌కే మట్టా వాదనలు వినిపించారు. 
 
ఈ సందర్భంగా ఈడీ సమన్లు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశామని విక్రమ్‌ చౌదరి న్యాయమూర్తికి తెలిపారు. 2023, సెప్టెంబర్‌ 15న ఈడీ తరపున సమన్లు ఇవ్వమని, కవితను అరెస్టు చేయబోమని చెప్పారని వెల్లడించారు. అదే నెల 26న మరోసారి వాదనలు జరిగాయని, ఈడీ న్యాయవాదులే వాయిదాలు తీసుకున్నారని తెలిపారు.
 
కాగా, ఈడీ తరపున న్యాయవాది జోయబ్‌ హుసేన్‌ వాదనలు వినిపిస్తూ తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. కవిత సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి మాత్రమే చేశారని వెల్లడించారు. సుప్రీం కోర్టులో చెప్పిన 10 రోజుల గడువు ఎప్పుడో తీరింది. తర్వాత ఎన్నోసార్లు కోర్టులో విచారణ జరిగిందని చెప్పారు.