ఆప్ కు రూ.100 కోట్ల ముడుపుల్లో కవితదే కీలక పాత్ర

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో  తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్న ఈడీ కవిత అరెస్టుపై అధికారిక ప్రకటన చేసింది. ఈ ప్రకటనలో సంచలన విషయాలను ఈడీ వెల్లడించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసి, కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని, విచారిస్తున్నామని ఈడీ స్పష్టం చేసింది. 
 
ఈ నెల 15వ తేదీన హైదరాబాద్‌లోని కవిత ఇంట్లో సోదాలు నిర్వహించామని తెలిపింది. అయితే సోదాలు చేస్తున్న సమయంలో కవిత కుటుంబ సభ్యులు ఆటంకం కలిగించారని పేర్కొంది. ఆప్ నేతలతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్లు తేలిందని ఈడీ ప్రకటించింది. రూ.100 కోట్ల మొత్తాన్ని ఆప్ నాయకులకు చేర్చడంలో కవిత కీలక పాత్ర పోషించారని వెల్లడించింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో ఆప్ అగ్రనేతలైన అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలతో కలిసి ఎంఎల్సీ కవిత కుట్ర పన్నినట్టు దర్యాప్తులో వెల్లడైందని వివరించింది. అనుమతుల కోసం ఆప్ నేతలకు ఆమె రూ.100 కోట్లు చేరవేశారు. అవినీతి, కుట్రల ద్వారా చిన్న వ్యాపారుల నుంచి డబ్బుని సేకరించి ఆప్‌ నేతలకు చేరవేశారని అని ఈడీ వివరించింది.
ఆప్ నేతలకు రూ.100 కోట్ల ముడుపుల చెల్లింపులో కవిత క్రీయశీలక పాత్ర పోషించిందని ఈడీ పేర్కొంది. ఇందుకు సంబంధించిన విషయాలపైనే లోతుగా విచారిస్తున్నామని ఈడీ వివరించింది.
 
మరోవైపు.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఇప్పటి వరకు  240 చోట్ల సోదాలు చేసినట్టు తెలిపింది ఈడీ. 5 అనుబంధ ఛార్జ్ షీట్‌లు దాఖలు చేసినట్లు ఈడీ పేర్కొంది. ఇప్పటివరకు రూ.128.79 కోట్ల ఆస్తులను గుర్తించి జప్తు చేశామని ఈడీ స్పష్టం చేసింది. ఈ కేసులో ఇప్పటికే మనిష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ సహా ఇప్పటివరకు 15 మందిని అరెస్టు చేశామని తెలిపారు.