వంద రోజులు పూర్తయినా ఆరు గ్యారంటీలు అమలు కాలేదే!

వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అములు చేస్తామని చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులు గడిచినా ఎందుకు హామీలను అమలు చేయలేదని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ‘ప్రజాహిత యాత్ర’లో భాంగంగా కరీంనగర్ నియోజకవర్గం, ఇల్లంతకుంట మండలం, రేపాక, సోమారంపేట, వెంకట్రావ్‌పల్ల్లె, ఇల్లంతకుంట, వంతడ్పుల, కందికట్కూర్, పొత్తూరు గ్రామాలలో ఆయన శుక్రవారం పర్యటించారు. 

ఈ సందర్భంగా ఇల్లంతకుంటలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో బండి సంజయ్ మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టి సాధ్యం కాని హామీలను ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. రైతు భరోసా రూ.15 వేలు , పింఛన్ రూ.4 వేలు, 500లకే సీలిండర్, ప్రతి మహిళకు రూ.2500లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.850 కోట్ల నిధులు విడుదల చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి బండి థ్యాంక్స్ తెలిపారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలను దోచుకోవడమే లక్షంగా పాలన కొనసాగించారని విమర్శించారు. గొర్రెల స్కీం పేరిట కోట్ల రూపాయాలు దండుకున్నారని ఆరోపించారు.

 కేంద్ర ప్రభుత్వ నిధులతో అన్ని గ్రామాలలో అభివృద్ధి పనులు జరిగితే బిఆర్‌ఎస్ వాళ్లు తామే చేశామని సంకలు గుద్దుకున్నారని దయ్యబట్టారు. ప్రధాని నరేంద్రమోదీ  వచ్చాక పంట మద్దతు ధర పెరిగిందని, యూరియా బ్యాగు అసలు ధర రూ.2500 ఉంటే , రైతులకు సబ్సిడీపై కేవలం రూ.250లకే అందిస్తున్నామని తెలిపారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని, లేనిపక్షంలో ప్రజల నుండి తిరుగుబాటు తప్పదని సంజయ్ హెచ్చరించారు. చాలా గ్రామాల్లో పంట పొలాలు ఎండిపోతున్నా సాగునీరందించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లకు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.