కవిత అరెస్ట్ తో ఇరకాటంలో కేజ్రీవాల్

దాదాపు 2 ఏళ్లుగా సాగుతున్న ఢిల్లీ మద్యం కేసులో తాజాగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో ఈ కేసులో ఒక్కసారిగా వేగం పెరిగింది. ఇప్పుడు అందరి దృష్టి ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై పడింది. ఇప్పటికే ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఈ కేసులో అరెస్ట్ అయి దాదాపు 2 ఏళ్లుగా జైలులోనే కాలం వెళ్లదీస్తున్నారు.
 
 ఈ క్రమంలోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు ఇప్పటికే 8 సార్లు సమన్లు జారీ చేశారు. అయినప్పటికీ ఆ సమన్లను దాటవేస్తున్న కేజ్రీవాల్. ఈ ఢిల్లీ లిక్కర్ కేసు రాజకీయ ప్రేరేపితం అని, కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం తమను వేధించేందుకే ఈ కేసులు పెట్టించిందని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఈ కేసులో సెషన్స్ కోర్టు కేజ్రీవాల్‌కు షాక్ ఇచ్చింది.

ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ సందర్భంగా ఈడీ అధికారులు ఇచ్చిన సమన్లను దాటవేసిన కేసులో మెజిస్ట్రేట్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని అరవింద్‌ కేజ్రీవాల్‌ పెట్టుకున్న అభ్యర్థనను సెషన్స్ కోర్టు నిరాకరించింది. ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు రావాలని ఈడీ అధికారులు ఇచ్చిన సమన్లను కేజ్రీవాల్ 8 సార్లు దాటవేస్తూ వచ్చారు.

 
ఈ వ్యవహారంలో మెజిస్ట్రేట్‌ కోర్టులో విచారణపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ సెషన్స్ కోర్టు నిరాకరించింది. ఈ కేసు విచారణలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోసం ట్రయల్‌ కోర్టును ఆశ్రయించాలని అదనపు సెషన్స్ జడ్జి రాకేశ్‌ సియాల్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఆదేశాలు ఇచ్చారు.  ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణ కోసం కేజ్రీవాల్‌కు ఇప్పటివరకు 8 సార్లు ఈడీ అధికారులు సమన్లు పంపించారు. అయితే ఒక్కసారి కూడా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. మొదటి 3 సమన్లకు కేజ్రీవాల్ రాలేదని ఫిబ్రవరి నెలలోనే మెజిస్ట్రేట్‌ కోర్టులో ఈడీ అధికారులు ఫిర్యాదు చేశారు. 
 
దీనిపై అప్పుడే విచారణ జరిపిన మెజిస్ట్రేట్ కోర్టు ఫిబ్రవరి 17 వ తేదీకి విచారణకు వెళ్లాలని కేజ్రీవాల్‌ను ఆదేశించింది. అయితే ఆ సమయంలో ఢిల్లీ అసెంబ్లీలో తమ ప్రభుత్వానికి విశ్వాస పరీక్ష ఉండటంతో కేజ్రీవాల్ వర్చువల్‌గా హాజరయ్యారు. తర్వాతి విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతానని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దానికి అంగీకరించిన కోర్టు విచారణను వాయిదా వేసింది.