
* కేరళలో కమలం వికసిస్తుంది
ఈ దేశాన్ని, సంస్కృతిని, వారసత్వాన్ని డిఎంకె ద్వేషిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. శుక్రవారం కన్యాకుమారిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ తమిళనాడు భవిష్యత్తుకు, సంస్కృతికి డిఎంకె శత్రువు అంటూ ధ్వజమెత్తారు. అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ట వేడుక ప్రసారాన్ని డిఎంకె నిలిపివేయాలని ప్రయత్నించింది.
అయితే దీనిపై సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని మందలించాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఢిల్లీలో కొత్త పార్లమెంటు భవనంలో తమిళ సంస్కృతికి చిహ్నమైన పవిత్రమైన సెంగోల్‌ను ఏర్పాటు చేశామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కానీ ఈ వ్యక్తులు దానిని కూడా బహిష్కరించారని, వారు సెంగోల్ స్థాపనను ఇష్టపడలేదని ఆరోపించారు.
వివాదాస్పదమైన జల్లికట్టుకు మార్గం సుగమం చేసింది తమ ప్రభుత్వమే అని ఆయన తెలిపారు. ఈ దేశాన్ని విభజించాలని చూసిన వారిని జమ్మూకశ్మీర్ ప్రజలు తిరస్కరించారని, తమిళనాడు ప్రజలు కూడా ఇదే తరహా తీర్పు ఇస్తారని భావిస్తున్నట్లు చెప్పారు.
ప్రజలను లూటీ చేసేందుకు డీఎంకే, కాంగ్రెస్ అధికారరంలోకి రావాలని చూస్తున్నారని ఆరోపించారు. 2జీ స్కాంలో డీఎంకేనే అతిపెద్ద లబ్ధిదారు అని మోదీ విమర్శించారు. ‘ప్రజలకు చూపించడానికి బిజెపికి అభివృద్ధి కార్యక్రమాలుంటే.. ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’కు స్కామ్‌లు ఉన్నాయి’ అని మోదీ ఎద్దేవా చేశారు.
డిఎంకె, కాంగ్రెస్ పార్టీలు మహిళా వ్యతిరేకులు అవి, మహిళలను మోసం చేసి అవమానించాయని ప్రధాని మండిపడ్డారు. మాజీ సిఎం జయలలితో డిఎంకె కార్యకర్తలు ఎలా ప్రవర్తించారో తమిళనాడు ప్రజలకు తెలుసు అని ఆయన పేర్కొన్నారు. కన్యాకుమారిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టినట్లు మోదీ చెప్పారు.
తూత్తుకుడిలో చిదంబరనార్ పోర్టును ప్రారంభించిన తర్వాత తమ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తోందని ప్రధాని చెప్పారు. ఆధునిక ఫిషింగ్ బోట్‌ల కోసం వారికి ఆర్థిక సహాయం అందించడం నుంచి కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ పరిధిలోకి తీసుకురావడం వరకు, వారి అవసరాలను తీర్చామని ఆయన వెల్లడించారు.
గత పది సంవత్సరాలలో తమిళనాడులో సుమారు రూ. 50 వేల కోట్ల విలువైన హైవే ప్రాజెక్టుల్ని కేంద్రం పూర్తి చేసిందని, మరో రూ. 70 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని ప్రధాని వివరించారు. 1991లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ‘ఏక్తా యాత్ర’ ప్రారంభించానని మోదీ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తాజాగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణించానని వెల్లడించారు.
కాగా, రాబోయే జనరల్ ఎలక్షన్స్‌లో కేరళ ప్రజలు బీజేపీకి ఓటు వేస్తారని, కేరళలో కమలం వికసిస్తుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. కేరళలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఇక్కడ యువతను బీజేపీ ఎంకరేజ్ చేస్తోందని, పాతానమిట్టై నుంచి బీజేపీ అభ్యర్థిగా అనిల్ కే ఆంథోనీ పోటీ చేస్తున్నారని, ప్రజలకు సేవ చేసేందుకు ఆయన ఉత్సాహంగా ఉన్నట్లు ప్రధాని తెలిపారు.
కేరళ రాజకీయాల్లో ఇలాంటి యువరక్తం కావాలని, అందుకే కేరళ ప్రజలు కూడా ఈసారి బీజేపీకి 400 సీట్లు వస్తాయంటున్నారని పేర్కొన్నారు. యూడీఎఫ్, ఎల్డీఎఫ్ ఒక్కటై ఓటర్లను మోసం చేస్తున్నట్లు ఆయన ధ్వజమెత్తారు. కేరళ సంస్కృతిలో ఆధ్యాత్మిక ఉందని, యూడీఎఫ్, ఎల్డీఎఫ్ రాజకీయ హింసకు పాల్పడుతున్నాయని, ఇది కేరళలో శాంతికి విఘాతం కలిగిస్తోందని విమర్శించారు.
కాలేజీలు పలు ప్రాంతాల్లో కమ్యూనిస్టు గూండా అడ్డగా మారిందని పేర్కొంటూ అవినీతి, అసమర్థ ప్రభుత్వం వల్ల కేరళ ప్రజలు వేదనకు గురవుతున్నట్లు చెప్పారు. ఎల్డీఎఫ్, యూడీఎప్ సైకిల్‌ను బ్రేక్ చేస్తేనే కేరళ ప్రజలకు లాభం జరుగుతుందని ప్రధాని స్పష్టం చేశారు. అవినీతి ప్రభుత్వాన్ని కేరళ నుంచి తరిమివేయాలంటే తనకు మద్దతు ఇవ్వాలని మోదీ కోరారు.
More Stories
జమ్ముకశ్మీర్‌లో 12 మంది పాక్ చొరబాటుదారులు కాల్చివేత
రామ జన్మభూమిలో తొలి `కరసేవక్’ కామేశ్వర చౌపాల్ మృతి
ఐదేళ్లలో తొలిసారి వడ్డీ రేట్లు తగ్గింపు