సీఏఏ అమ‌లుపై అమెరికా వాఖ్యల పట్ల భారత్ ఆగ్రహం

పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మిల్లర్‌ చేసిన వ్యాఖ్యలపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. ఈ విషయం భారత్‌ అంతర్గత విషయమని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టం దేశానికి సంబంధించిన అంతర్గత విషయం అని తేల్చి చెప్పారు. 
 
`ఇది దేశ సమగ్ర సంప్రదాయాలకు, మానవ హక్కుల విషయంలో తమ దీర్ఘకాల నిబద్ధతకు అనుగుణంగా రూపొందించాము. అఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల నుండి 2014 వరకు భారత్‌కు వలస వచ్చిన హిందూ, సిక్కు, జైన, బౌద్ధ, పార్శీ, క్రైస్తవ వర్గాలకు చెందిన మైనారిటీలకు భారత పౌరసత్వం, భద్రత కల్పించే ఉద్ధేశ్యంతో ఈ చట్టం తీసుకొచ్చాము. ఈ చట్టం ఏ పౌరుడి హక్కులను తొలగించదు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.’ అని ఆయన భరోసా ఇచ్చారు.
 
సీఏఏ పై అమెరికా చేసిన వ్యాఖ్యలు అవగాహన లేనివి అని అంటూ ఘాటుగా స్పందించారు. పౌరసత్వ చట్టం ప్రకారం పౌరసత్వాన్ని ఇవ్వడమే కానీ తీసివేయడం గురించి కాదని, ఈ విషయం అందరికీ అర్థం కావాలని ఆయన హితవు చెప్పారు. ఈ చట్టం ‘ఏ దేశపు జాతీయత లేని వ్యక్తి సమస్యను పరిష్కరిస్తుంది. మానవ హక్కులకు మద్దతు ఇస్తుంది. మానవ గౌరవాన్ని అందిస్తుంది’ అని రణధీర్‌ పేర్కొన్నారు.
 
కాగా, భారత్‌లో సిఎఎ నోటిఫికేషన్‌ పట్ల ఆందోళనగా ఉందని, దాన్ని ఎలా అమలు చేస్తారన్నది తాము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని మతాలకు స్వేచ్ఛ ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ తెలిపారు. మిల్లర్‌ వ్యాఖ్యలకు భారత విదేశాంగ ప్రతినిధి రణ్‌ధీర్‌ కౌంటర్‌ ఇచ్చారు.