99 శాతం జిల్లాలకు విస్తరించిన ఆర్ఎస్ఎస్

 
* సంఘ్ వార్షిక శిక్షావర్గ్ స్వరూపంలో మార్పులు
 
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యక్రమాలు ప్రస్తుతం దేశంలోని 99 శాతం జిల్లాలకు విస్తరించినట్లు ఆ సంస్థ సహ సర్కార్యవా డాక్టర్ మన్మోహన్ వైద్య తెలిపారు. నాగ్‌పూర్‌లోని రేషింబాగ్‌  స్వామి దయానంద్ సరస్వతి ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభమైన మూడు రోజుల అఖిల భారతీయ ప్రతినిధి సభ (ఎబిపిఎస్)  సమావేశాల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సంస్థ  వ్యవస్థాపకుడు, మొదటి సర్ సంఘచాలక్ డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ “ఆర్ఎస్ఎస్ మొత్తం సమాజంకు చెందిన సంస్థ” అని చెప్పారని గుర్తు చేశారు.
 
గత 99 సంవత్సరాల నుండి తాము ఆ మాటలలోని వాస్తవికతను ఆచరణలో చూస్తున్నామని చెప్పారు.  2017 నుండి ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల విస్తరణ దేశంలో గణనీయంగా కనిపిస్తున్నదని అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ తో కలిసి తెలిపారు. సంఘ నిర్మాణపరంగా దేశవ్యాప్తంగా 45 ప్రాంతాలలో పనిచేస్తుందని పేర్కొంటూ దేశం మొత్తాన్ని 922 జిల్లాలు, 6597 ఖండాలు, 27,720 మండలాల్లో 73,117 రోజువారీ శాఖలు జరుగుతున్నాయని వివరించారు. 
 
ఒక్కో మండలం 12 నుండి 15 గ్రామాలను కలిగి ఉంటుందని, గత ఏడాదిగా శాఖల సంఖ్యలో 4,466 వృద్ధి సాధించామని చెప్పారు. ఈ శాఖలలో 60 శాతం విద్యార్థులు, 40 శాతం మంది కార్యకర్తలు ఉంటారని, వీరిలో 40 పైబడిన వయస్సు గల స్వయంసేవకుల శాఖలు 11 శాతం అని తెలిపారు. గత ఏడాది కన్నా 840 ఎక్కువగా 27,717 సాప్తహిక్ మిలన్ లు ఉన్నాయని చెప్పారు.
 
ప్రస్తుతం సంఘ మండలి సంఖ్య 10,567. పట్టణాలు, నగరాల్లోని పది వేల బస్తీల్లో 43 వేల శాఖలు ఉన్నాయి. 44 ప్రాంతాలలో 460 మహిళా సమన్వయ కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్ర సేవికా సమితి నుండి 5 లక్షల 61 వేల మంది మహిళలు, వివిధ సంస్థలలోని మహిళలు హాజరయ్యారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతజయంతి సంవత్సరం దృష్ట్యా ఇది చాలా ముఖ్యమైనదని చెబుతూ భారతీయ చింతన్, సామాజిక పరివర్తనలో మహిళల చురుకైన భాగస్వామ్యాన్ని మెరుగుపరచడం దీని లక్ష్యం అని వివరించారు.
 
అహల్యాబాయి హోల్కర్ జన్మ తృతీయ సంవత్సరాన్ని మే 2024 నుండి ఏప్రిల్ 2025 మధ్య జరుపుకుంటామని డా. వైద్య తెలిపారు. మతపరమైన స్థలాలను పునర్నిర్మించిన, అణగారిన వారి ఆర్థిక స్వావలంబన కోసం తీవ్రంగా కృషి చేసిన అహల్యాబాయి రచనల గురించి సమాజానికి పెద్దగా తెలియదని ఆయన పేర్కొన్నారు. ఆమె ప్రాముఖ్యత గురించి దేశవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
 
ఎన్నికలు రానున్న దృష్ట్యా స్వయంసేవకులు కూడా ఇంటింటికి వెళ్లి వంద శాతం ఓటింగ్‌పై అవగాహన కల్పిస్తారని డాక్టర్ వైద్య తెలిపారు. అయోధ్యలో రాంలల్లా ప్రాణ్ ప్రతిష్ఠ సందర్భంగా ఆర్ఎస్ఎస్ దేశవ్యాప్తంగా  భారీ ప్రచార కార్యక్రమాన్ని జరిపిందని చెబుతూ అక్షింతల పంపిణీ ప్రచారంలో స్వయంసేవకులు సహా 44 లక్షల 98 వేల 334 మంది రామభక్తులు 5,78,778 గ్రామాలు, 4,727 నగరాల్లోని 19 కోట్ల 38 లక్షల 49 వేల 71 కుటుంబాలకు చేరుకున్నారని వివరించారు.
 
అన్ని చోట్లా లభించిన ప్రోత్సాహకర స్పందన, సాదర స్వాగతం సమాజంలో ఆర్‌ఎస్‌ఎస్ పట్ల ఉన్న విశ్వాసానికి భరోసానిచ్చిందని డాక్టర్ వైద్య చెప్పారు. ప్రతి ఏడాది జరిపే సంఘ్ శిక్షా వర్గ్‌ నిర్వహణలో కొత్త పాఠ్యాంశాలు చేర్చడంతో పాటు, కొత్త స్వరూపం ఈ ఏడాది నుండి ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.
 
గతంలో 7-రోజుల ప్రాథమిక వర్గ, 20 రోజుల ప్రథమ సంవత్సరం శిక్షావర్గ,  20 రోజుల ద్వితీయ సంవత్సరం శిక్షావర్గ,  25 రోజుల తృతీయ సంవత్సర శిక్ష వర్గ జరిగేవని తెలిపారు. అయితే ఇకమీదట, కొత్త స్వరూపంలో మొదటగా 3 రోజుల ప్రారంభిక వర్గ, 7 రోజుల ప్రాథమిక వర్గ,  15 రోజుల సంఘ శిక్షా వర్గ,  ఆ తర్వాత 20 రోజుల కార్యకర్త వికాస్ వర్గ-1,   25 రోజుల కార్యకర్త వికాస్ వర్గ-2 లు జరుగుతాయని వివరించారు.

ఈ కొత్త స్వరూపంలో ప్రత్యేకంగా ఆచరణాత్మక శిక్షణ  ఉంటుందని ఆయన చెప్పారు. కాగా, ఆర్ఎస్ఎస్ అధికారిక వెబ్‌సైట్ rss.org ద్వారా 2017 – 2023 మధ్య సంవత్సరానికి సగటున ఒక లక్ష మంది ‘ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరండి’ ద్వారా అభ్యర్ధనలు పంపారని తెలిపారు. అయితే, ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి మధ్య, రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కారణంగా ఈ సంఖ్య రెండింతలు పెరిగిందని ఆయన తెలియజేశారు. అఖిల భారతీయ సహ ప్రచార ప్రముఖ్ లు నరేంద్రకుమార్, అలోక్ కుమార్ కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.