ఎల్ఐసి ఉద్యోగులకు 16 శాతం వేతనాలు పెంపు

ఎల్ఐసీ ఉద్యోగులకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక వేతనాల్ని 16 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత కనీస వేతనంపైనే వేతనాల పెంపు వర్తిస్తుంది. ఇది 2022 ఆగస్ట్ నుంచే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ లెక్కన గత రెండేళ్ల బకాయిలు కూడా ఉద్యోగులకు అందనున్నాయన్న మాట. 
 
ఇక ఇతర మొత్తం అలవెన్సులు కలిపి వేతనాల పెంపు సుమారు 22 శాతం వరకు ఉందని సమాచారం. ఈ నిర్ణయంతో మొత్తం లక్ష మందికిపైగా ఉద్యోగులు, 30 వేల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. తాజాగా వేతనాల పెంపుతో ఎల్ఐసీపై అదనంగా వార్షిక ప్రాతిపదికన రూ. 4 వేల కోట్లకు పైగా భారం పడనుంది. ఇక వేతనాల కోసమే ఎల్ఐసీ ఏడాదికి రూ. 29 వేల కోట్లకుపైగా వెచ్చించాల్సి వస్తుంది.

కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల కిందట ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్, పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ మరో 4 శాతం పెంచి 50 శాతానికి చేర్చిన సంగతి తెలిసిందే. ఇది జనవరి 1 నుంచి వర్తిస్తుందని స్పష్టం చేసింది. దీంతో కోటి మందికిపైగా ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది.
2023-24 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఎల్ఐసీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన చూస్తే ఏకంగా 49 శాతం పెరిగి రూ. 9444.4 కోట్లుగా నమోదైంది.  అంతకుముందు ఇది రూ. 6334.2 కోట్లుగా ఉండేది. నెట్ ప్రీమియం ఇన్‌కం పెరగడం సహా ఇన్వెస్ట్‌మెంట్లపై నికర ఆదాయం పెరగడమే కారణం.

మరోవైపు ఎల్ఐసీ షేరు ఇటీవల భారీగా దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. రూ. 1175 వద్ద ఆల్ టైమ్ హైని నమోదు చేసింది. తర్వాత మళ్లీ పడిపోయింది. నెల వ్యవధిలో 10 శాతానికిపైగా తగ్గింది. అయితే ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 7 శాతానికిపైగా పెరిగింది. ప్రస్తుతం షేరు ధర రూ. 926 వద్ద ఉంది. ఎల్ఐసీ మార్కెట్ విలువ రూ. 5.85 లక్షల కోట్లుగా ఉంది.