విరాళాలకు, ఈడీ దాడులకు సంబంధం లేదు

ఎన్నికల విరాళాలకు, ఈడీ దాడులకు సంబంధం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టంచేశారు. ఈడీ దాడులకు ఉపక్రమించగానే తమను తాము రక్షించుకోవడం కోసం కొన్ని కంపెనీలు ఎన్నికల బాండ్లను కొనుగోలు చేశాయని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆమె  తేల్చిచెప్పారు. ఆ ప్రచారం ఉత్త ఊహాగానమేనని ఆమె కొట్టిపారేశారు. 
 
ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన తర్వాత కూడా ఈడీ దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయని ఆమె చెప్పారు. ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కాంక్లేవ్‌లో ఆమె మాట్లాడారు.  భారత అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఎస్‌బీఐ అందజేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. 
 
అయితే, ఆ వివరాల్లో ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసిన కొన్ని సంస్థలపై గతంలో సీబీఐ, ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేశాయనే అంశం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. డేటా ప్రకారం, రాజకీయ పార్టీలకు అత్యధికంగా విరాళం ఇచ్చిన మొదటి 30 కంపెనీల్లో 15 కంపెనీలకు పైగా ఈడీ, సీబీ, ఆదాయ పన్ను శాఖల నుంచి దర్యాప్తును ఎదుర్కొన్నాయి.
 
అయితే ఎలక్టోరల్‌ బాండ్లు కొనుగోలు చేసిన కొన్ని సంస్థలపై గతంలో సీబీఐ, ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులకు ఉపక్రమించాయని, ఆ దాడుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి కొన్ని కంపెనీలు ఎన్నికల బాండ్లను కొనుగోలు చేశాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై నిర్మలా సీతారామన్‌ స్పందిస్తూ ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా వచ్చిన విరాళాలన్నీ బీజేపీకే వెళ్లినట్లు ప్రచారం చేస్తున్నారని, బీజేపీతోపాటు కొన్ని ప్రాంతీయ పార్టీలకు కూడా విరాళాలు వెళ్లాయి కదా..! అని ఆమె అడిగారు.ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలంటూ ఎస్‌బీఐని సుప్రీంకోర్టు ఆదేశించించడం గురించి ప్రస్తావించగా ప్రస్తుతం ఆ అంశం కోర్టు పరిధిలో ఉందని చెప్పారు. కోర్టు అడిగిన వివరాల సంగతి ఎస్‌బీఐ చూసుకుంటుందని చెప్పారు. ఎన్నికల బాండ్ల స్కీమ్‌ గురించి మాట్లాడుతూ గత వ్యవస్థలోనూ లోపాలు ఉన్నాయి కదా అని నిర్మలా సీతారామన్‌ ప్రశ్నించారు. 

తనకంటే ముందు ఆర్థికమంత్రిగా ఉన్న అరుణ్‌జైట్లీ మునుపటి కంటే మెరుగైనదిగా భావించి ఈ ఎలక్టోరల్‌ బాండ్ల స్కీమ్‌ను తీసుకొచ్చారని ఆమె చెప్పారు. ఇప్పుడు కొనుగోలు చేసిన బాండ్లు నేరుగా రాజకీయ పార్టీల ఖాతాల్లోనే పడుతున్నాయని, సుప్రీంకోర్టు ఆదేశాల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.