ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను వెల్లడించిన ఎన్నికల కమిషన్‌

* కనిపించని అదానీ, రిలయన్స్, జిఎంఆర్ వంటి పేర్లు
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. ఈ వివరాలను ఈసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. 13న బాండ్ల వివరాలను ఈసీకి ఎస్బీఐ అందించగా, 15న సాయంత్రం 5 గంటల్లోగా ఈ వివరాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగా గడువుకు ఒక రోజు ముందే వెబ్‌సైట్‌లో ఎన్నికల బాండ్ల డాటాను ఈసీ అప్‌లోడ్‌ చేసింది. 
 
2019 ఏప్రిల్‌ 12 నుంచి 2024 జనవరి 24 మధ్య కాలంలో వెయ్యి రూపాయల నుంచి కోటి రూపాయల వరకు ఎస్బీఐ విక్రయించిన బాండ్ల వివరాలు ఇందులో ఉన్నాయి. రెండు భాగాలుగా బాండ్ల వివరాలను వెల్లడించింది. ఒక భాగంలో ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేసిన దాతలు, సంస్థల వివరాలు ఉన్నాయి. రెండో భాగంలో ఈ బాండ్ల ద్వారా నిధులు పొందిన రాజకీయ పార్టీల వివరాలను వెల్లడించింది.
బిజెపికి భారీగా నిధులు సమకూరుస్తున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న దేశంలోని ప్రముఖమైన పారిశ్రామిక సంస్థలైన అదానీ, రిలయన్స్, జిఎంఆర్ వంటి గ్రూపులు ఎలెక్టోరల్ బాండ్లు కొన్నట్లు ఈ జాబితా చూస్తుంటే వెల్లడవుతుంది.

దేశంలోనే అత్యధికంగా అధికార భారతీయ జనతా పార్టీ రూ.11,562 కోట్ల విరాళాలు కోట్లను ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో అందుకుంది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ రెండో స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిలిచింది. దానికి రూ.3,214 కోట్లు వచ్చాయి. మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌కు రూ.2,818 కోట్లు, నాలుగో స్థానంలోని భారత రాష్ట్ర సమితికి రూ.2,278 కోట్లు ఎన్నికల బాండ్ల జారీ ద్వారా అందాయి. 

ఒడిశాలో అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్‌కు రూ.1550 కోట్లు, తమిళనాడును పాలిస్తున్న డీఎంకే పార్టీకి రూ.1230 కోట్లు, ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి రూ.662 కోట్లు విరాళంగా వచ్చాయి. టీడీపీకి రూ.437 కోట్లు, జనసేన పార్టీకి రూ.42 కోట్లు, ఉద్ధవ్ శివసేనకు రూ.316 కోట్లు, లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీకి రూ.145 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.130 కోట్లు విరాళంగా అందాయి..

2018 నుంచి ఇప్పటివరకు బీజేపీకి అత్యధికంగా 8,633, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 3,305, కాంగ్రెస్ పార్టీకి 3,146, ఆమ్ ఆద్మీ పార్టీకి 245, డీఎంకేకు 648, బాండ్ల జారీ ద్వారా విరాళాలు వచ్చాయి. భారత రాష్ట్ర సమితికి 1,806 ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 472, టీడీపీకి 279, జనసేన పార్టీకి 39 ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు అందాయి.

ఎక్కువ ఎలక్టోరల్‌ బాండ్లను కోయంబత్తూరు కేంద్రంగా పని చేసే ఫ్యూచర్‌ గేమింగ్‌ అండ్‌ హోటల్‌ సర్వీసెస్‌ సంస్థ కొనుగోలు చేసింది. వేర్వేరు పేర్లతో ఈ సంస్థ కేరళ, సిక్కిం తదితర రాష్ర్టాల్లో లాటరీ వ్యాపారం నిర్వహిస్తున్నది. ఈ సంస్థ రూ.1,368 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. లాటరీ కింగ్‌గా పేరున్న మార్టిన్‌ శాన్‌టియాగో ఈ సంస్థకు యాజమాని. ఈ సంస్థపై మనీలాండరింగ్‌ ఆరోపణలతో ఈడీ విచారణ జరుపుతున్నది.

ఈసీ వెల్లడించిన ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలపై కాంగ్రెస్‌ పార్టీ పలు అనుమానాలను లేవనెత్తింది. దాతల వివరాల్లో 18,871 ఎంట్రీలు ఉండగా, బాండ్లు అందుకున్న వారి వివరాల్లో 20,421 ఎంట్రీలు ఎందుకున్నాయని, ఈ వ్యత్యాసానికి కారణమేంటని కాంగ్రెస్‌ నేత అమితాబ్‌ దూబే ఎక్స్‌లో ప్రశ్నించారు.

ఎలక్టోరల్‌ బాండ్ల కేసులో మార్చి 11న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఎన్నికల కమిషన్‌ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం విచారించనుంది. ఇంతకుముందు ఎలక్టోరల్‌ బాండ్లకు సంబంధించి సీల్డ్‌ కవర్‌లో సుప్రీంకోర్టుకు సమర్పించిన స్టేట్‌మెంట్లను ఈసీ కార్యాలయంలో పెట్టాలని సుప్రీంకోర్టు మార్చి 11న ఈసీని ఆదేశించింది. 

అయితే, పారదర్శకత పాటించేందుకు గానూ ఈ డాక్యుమెంట్ల కాపీలను తమ వద్ద పెట్టుకోలేదని, కాబట్టి కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లను తిరిగివ్వాల్సిందిగా సుప్రీంకోర్టును ఈసీ కోరింది.