ఎన్నికలే లక్ష్యంగా ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడ్డ ప్రణీత్‌

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబి) మాజీ డిఎస్‌పి ప్రణీత్ రావు అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాను అలా చేశానని, ఆ డేటాను కూడా ధ్వం సం చేశానని చెప్పినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏకంగా టీపీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ట్యాపింగ్‌కు పాల్పడ్డారని తెలుస్తోంది. 
 
రేవంత్‌ ఆయన సహచర బృందం కదలికలను గుర్తించడంతో పాటు ఎన్నికల్లో కాంగ్రె స్‌కు డబ్బులు ఎక్కడినుంచి, ఏయే మార్గాల్లో, ఎవరెవరు సర్దుబాటు చేస్తున్నారు..? అనే వివరాలను ప్రణీత్‌ ట్యాపింగ్‌ చేశారు. ముఖ్యంగా ఎన్నికలకు కొద్ది నెలల ముందు నుంచి రేవంత్‌తో పాటు ఆయనకు అత్యంత సన్నిహితులు, సహకరించే అందరి ఫోన్‌లపైనా ట్యాపింగ్‌ కొనసాగినట్లు ఆధారాలు లభించినట్లు తెలిసింది. 
 
అప్పటి అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ ఆదేశాల మేరకు నడుచుకున్న ప్రణీత్‌  రాజకీయ నాయకులు, పోలీసులతో పాటు ప్రైవేటు వ్యక్తుల సహకారం కూడా తీసుకున్నారు. ఎక్కడికక్కడ తమకు అందుతున్న సమాచారం, ఫోన్‌ నంబర్ల ఆధారంగా ఎస్‌ఐబీ ప్రధాన కార్యాలయం, ఇతర వార్‌ రూంల నుంచి రోజుల వ్యవధిలోనే వందల ఫోన్‌ల ట్యాపింగ్‌కు పాల్పడ్డారు. 
 
హార్డ్‌ డిస్క్‌ల ధ్వంసం, కీలక పత్రాల దహనం కేసు దర్యాప్తులో భాగంగా ప్రణీత్‌ ఫోన్‌లోని వాట్సాప్‌ చాటింగ్‌లను దర్యాప్తు అధికారులు పరిశీలించగా బీఆర్‌ఎస్‌ నేతలతో పాటు ప్రైవేటు వ్యక్తుల నుంచి వచ్చిన సందేశాలను పరిశీలించారు. ఎన్నికల్లో డబ్బులు ఎవరెవరి చేతులు మారుతున్నాయన్న సమాచారం గుర్తించి కట్టడి చేశారని స్పష్టమైంది. 
 
అరెస్టు సమయంలో ప్రణీత్‌రావును ప్రాథమికంగా విచారించగా ఒక ఎస్పీ, ఎస్‌ఐబీ అప్పటి చీఫ్‌ ఆదేశాల మేరకే తాను, తన బృందం పనిచేసినట్లు వెల్లడించినట్లు తెలిసింది. ప్రణీత్‌ను కస్టడీకి తీసుకుని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఏడు రోజుల కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 
 
కాగా, ప్రణీత్‌రావు కేసుకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుపై సీఎం రేవంత్‌ పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆరా తీసినట్లు సమాచారం. ప్రణీత్‌తో అంటకాగి కుట్రలో భాగస్వాములైన ఎస్‌ఐబీ అప్పటి ఉన్నతాధికారులను నేడో రేపో విచారించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. పంజాగుట్ట పోలీసులు వారికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఎన్నికల ముందు పనిచేసినవారిపై దృష్టిపెట్టినట్లు సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో అధికారులు వారి ఇళ్లలోనే ప్రత్యేక గదుల్లో (వార్‌ రూమ్‌లు) ఏర్పాట్లు చేసి, ట్యాపింగ్‌కు పాల్పడినట్లు గుర్తించారు.