పేటియంలో 20 శాతం ఉద్యోగులపై వేటు

ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల వేదిక పేటియం మాతృసంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించిందని సమాచారం. సంస్థల్లో పని చేస్తున్న 20 శాతం మంది సిబ్బందిపై వేటు వేసిందని రిపోర్టులు వస్తోన్నాయి. మార్చి 15 నుంచి పేటియం పేమెంట్‌ బ్యాంక్‌పై ఆర్‌బిఐ ఆంక్షలు ప్రారంభం కావడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 
 
పొదుపు చర్యల్లో భాగంగా ఇటీవలే 1000 మందిని తొలగించిన పేటియం తాజా చర్యలు ఆ సంస్థ ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఉద్యోగుల వార్షిక పనితీరు ఆధారంగా వివిధ విభాగాల్లో పని చేస్తున్న వారిని తొలగించాలని నిర్ణయానికి వచ్చింది.
 
కాగా  తన వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఎఐ) ఆధారిత సొల్యూషన్స్‌ అమలుపై కేంద్రీకరించడం కూడా ఉద్యోగుల తొలగింపునకు మరో కారణమని ఆ సంస్థ లీకులు ఇచ్చినప్పటికీ  అసలు కారణాలు వేరే ఉన్నాయని తెలుస్తోంది. తొలగింపులు అంశంపై హెచ్‌ఆర్‌ విభాగం అధికారులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఒక్కొక్కరిని పిలిచి సమాచారం ఇస్తున్నారు.
 
పేటియం పేమెంట్స్‌ బ్యాంకింగ్‌ లిమిటెడ్‌పై శుక్రవారం నుంచి ఆర్‌బిఐ ఆంక్షలు అమల్లోకి రానున్న నేపథ్యంలో గురువారం స్టాక్‌ మార్కెట్లలో ఓ దశలో పేటియం షేర్‌ విలువ 5 శాతం శాతం పతనమైంది. బిఎస్‌ఇలో తుదకు స్వల్ప నష్టంతో రూ.350.65 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ.334-362 మధ్య కదలాడింది. గడిచిన ఐదు సెషన్లలో 11.99 శాతం నష్టపోయింది. 
 
థర్డ్‌ పార్టీ పేమెంట్‌ యాప్‌గా అనుమతించాలని పేటియం పెట్టుకున్న దరఖాస్తును నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పిసిఐ) పరిశీలిస్తున్న వన్‌97 కమ్యూనికేషన్స్‌ షేర్‌ పతనం కావడం గమనార్హం. ప్రస్తుతం పేటియం ఫాస్టాగ్‌ ఉపయోగిస్తున్న వినియోగదారులు ఇతర విత్త సంస్థల వద్ద కొత్త ఫాస్టాగ్‌ తీసుకోవాలని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఎఐ) సూచించింది. 
 
టోల్‌ప్లాజాల వద్ద రద్దీని నివారించేందుకు, ప్రయాణం సులభతరం చేసేందుకు మార్చి 15లోగా ఏదైనా బ్యాంకు నుంచి కొత్తగా ఫాస్టాగ్‌ తీసుకోవాలని బుధవారం తన అడ్వైజరీలో పేర్కొన్న విషయం తెలిసిందే.