మూడు సెమీ కండక్టర్‌ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రూ. 1.26 లక్షల కోట్ల విలువైన మూడు సెమీ కండక్టర్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ‘ఇండియాస్‌ టేకేడ్‌ చిప్స్‌ ఫర్‌ విక్షిత్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ  ‘యువత ఉజ్వల భవిష్యత్తు దిశగా మేము అడుగులు వేస్తున్నాము’ అని చెప్పారు. ఈ ప్రాజెక్టులు మూడింట్లో రెండు గుజరాత్‌లోనూ, ఒకటి అస్సాంల్లోనూ నెలకొల్పనున్నారు.

ప్రధాని శంకుస్థాపన చేసిన సెమీ కండక్టర్‌ ప్రాజెక్టులు గుజరాత్‌లోని ధొలేరా స్పెషల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ (డిఎస్‌ఐఆర్‌)లో సెమీకండక్టర్‌ ఫ్యాబ్రికేషన్‌ సౌకర్యం, గుజరాత్‌లోని సనంద్‌లోని అవుట్‌సోర్స్‌ సెమీకండక్టర్‌ అసెంబ్లీ, టెస్ట్‌ ఏర్పాటు చేయనుంది. అలాగే అస్సాంలోని మోరిగావ్‌లో అవుట్‌సోర్డ్స్‌ సెమీకండక్టర్‌ అసెంబ్లీ, టెస్ట్‌ యూనిట్‌లను నెలకొల్పనుంది.

కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌ రాష్ట్రం, అహ్మదాబాద్‌ జిల్లా ధొలేరా ప్రాంతంలో సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో స్పెషల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌గా తీర్చిదిద్దేలా నడుం బిగించింది. ఈ వంద ఎకరాల్లో ఆయా సంస్థ సెమీ కండక్టర్‌ యూనిట్‌లను ఏర్పాటు చేయొచ్చు. దీనిద్వారా యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించొచ్చని కేంద్రం అంచనా.

ఇప్పటికే గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాంతంలో దేశంలోనే తొలి సెమీ కండక్టర్‌ ఫ్యాబ్రికేషన్‌ (ఫ్యాబ్‌) సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు టాటా ఎలక్ట్రానిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (టీఈపిఎల్‌) సిద్ధమైంది. రూ. 91 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. ఈ సౌకర్యాలు సెమీ కండక్టర్‌ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. భారత్‌ సైతం సెమీ కండక్టర్‌ విభాగంలో రాణించడమే కాదు.. వేలాది మందికి ఉపాధిని కల్పిస్తాయి. ఎలక్ట్రానిక్స్‌, టెలికాం మొదలైన సంబంధిత రంగాలలో ఉపాధి కలగనుంది.