మమతా బెనర్జీ తలకు తీవ్ర గాయం

లోక్‌సభ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి తీవ్ర గాయం అయింది. దీంతో ఆమె ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతోంది. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. మమతా బెనర్జీకి సంబంధించిన ఒక ఫోటోను కూడా టీఎంసీ ట్వీట్‌తోపాటు షేర్ చేసింది. 
 
ఆ ఫోటోలో దీదీ ఆస్పత్రి బెడ్‌పై పడుకుని ఉన్నట్లు ఉంది. ఆమె తలకు తీవ్ర గాయం కాగా ఆ గాయం నుంచి రక్తం ధారగా కారుతున్నట్లు ఉంది. నుదుటి నుంచి రక్తం కారుతూ కళ్లపై నుంచి ముక్కు, నోరు గుండా మెడ వరకు కారినట్లు ఆ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీదీ ఆరోగ్యం గురించి ట్వీట్ చేసిన టీఎంసీ  మమతా బెనర్జీ త్వరగా కోలుకోవాలని అంతా ప్రార్థించండి అని తెలిపింది. 
 
అయితే తన ఇంట్లో ఎక్సర్‌సైజ్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వ్యాయామం చేస్తూ దీదీ కింద పడిపోవడంతో ఆమె నుదుటికి ఏదో వస్తువు గట్టిగా తగిలినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ రంధ్రం ఏర్పడి రక్తం ధారగా కారుతున్నట్లు ఫోటోను చూస్తే అర్థం అవుతోంది.
 
ఎక్సర్‌సైజ్ చేస్తుండగా కింద పడి తీవ్ర గాయాలపాలైన దీదీని ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్ వెంటనే ఆమెను కోల్‍‌కతాలోని ఎస్ఎస్‌కేఎం ఆస్పత్రికి తరలించినట్లు టీఎంసీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎస్ఎస్‌కేఎం ఆస్పత్రి డాక్టర్లు మమతా బెనర్జీకి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటికి రావాల్సి ఉంది. 
 
ఈ ఘటనకు సంబంధించి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, టీఎంసీ పార్టీ మరిన్ని వివరాలను వెల్లడించలేదు.  ఈ క్రమంలోనే సీఎం మమతా బెనర్జీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ ట్విటర్‌లో తెలిపారు. త్వరగా మంచి ఆరోగ్యంతో దీదీ తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. 
 
అయితే ఈ ఏడాదిలోనే మమతా బెనర్జీ గాయపడటం ఇది రెండోసారి. జనవరి నెలలో బర్ధమాన్ జిల్లా నుంచి తిరిగి వస్తుండగా ఆమె కాన్వాయ్‌కి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దీదీ నుదిటికి పై భాగంలో గాయం అయింది. భారీ వర్షం కురుస్తుండగా సీఎం కారు డ్రైవర్ సడన్ బ్రేకులు వేయడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మమతా బెనర్జీ తలకు గాయం కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. అలాగే పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ మమత కాలికి గాయమయింది. కాలికి కట్టుకునే ఆమె ప్రచారంలో పాల్గొన్నారు.