జాతి వ్యతిరేకతను రెచ్చగొట్టడమే `ఇండియా’ అజెండా

అవినీతి, దుష్పరిపాలనకు నిదర్శనంగా మారి జాతి వ్యతిరేకతను రెచ్చగొట్టడమే అజెండాగా ప్రతిపక్ష ఇండియా కూటమి చేసుకుందని ప్రధాని నరేంద్ర మోదీ  ఆరోపించారు. అవినీతిని, బుజ్జగింపు రాజకీయాలను కూకటి వేళ్లతో పెకిలించి వేయడమే తన లక్షమని ఆయన ప్రకటించారు. 

గురువారం ఆత్మనిర్భర్ నిధి పథకం కింద వీధి వ్యాపారులకు స్వయం ఉపాధి కోసం రుణాలను అందచేసే కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ  ప్రజా సంక్షేమం ద్వారా దేశ సంక్షేమం చూడడమే తన సిద్ధాంతమని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలలో బిజెపిని ఓడించడానికి దేశ రాజధానిలో చేతులు కలిపిన ప్రతిపక్ష కూటిపై ఆయన ఆరోపణలు గుప్పించారు. 

రాత్రీ పగలూ తనను దూషించడానికే వారంతా చేతులు కలిపారని ఆయన చెప్పారు. గత ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోని వీధి వ్యాపారులకు తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఎం స్వనిధి పథకం గొప్పవరమని ప్రధాని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల కాలంలో రుణం కోసం బ్యాంకుల చుట్టూ వీధి వ్యాపారులు ప్రదక్షిణలు చేసి అవమానాలు ఎదుర్కొనేవారని, అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకునేవారని ఆయన చెప్పారు.

మోదీ కీ గ్యారంటీతో వారికి బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు లభిస్తున్నాయని ఆయన తెలిపారు. దాదాపు 62 లక్షల మంది వీధి వ్యాపారులకు దాదాపు రూ. 11,000 కోట్ల రుణాలను అందచేయడం జరిగిందని ఆయన చెప్పారు. దేశ రాజధానిలో నివసిస్తున్న పేదలు, మధ్య తరగతి ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని తెలిపారు. 

దేశంలోని నగరాలలో ట్రాఫిక్ కష్టాలను తొలగించి, కాలుష్యాన్ని నివారించడానికి తమ ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తోందని ఆయన చెప్పారు. ఢిల్లీలో 1,000 పైగా ఎలెక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టామని, నగరం చుట్టూ ఎక్స్‌ప్రెస్‌వేలను విస్తరించడంతోపాటు మెట్రో నెట్‌వర్క్‌ను పెంచుతున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డిల్లీ మెట్రో ఫేస్ 4కు చెందిన రెండు అదనపు కారిడార్లకు ప్రధాని శంకుస్థాపన చేశారు.