బాధ్యతలు చేపట్టిన కొత్త ఎన్నికల కమిషనర్లు

కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా నియమితులైన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు సుఖ్‌బీర్‌ సింగ్‌  సింధూ, జ్ఞానేశ్‌ కుమార్‌ శుక్రవారం ఉదయం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.  ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘానికి రాజీవ్‌ కుమార్‌ చీఫ్‌ కమిషనర్‌గా ఉన్నారు. 
 
కమిషనర్‌గా ఉన్న అనూప్‌ చంద్ర పాండే గత నెలలో పదవీ విరమణ చేయగా, మరో కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌ ఇటీవలే అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో కొత్త కమిషనర్ల నియామకం అనివార్యమైంది. గురువారం ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కమిటీ కొత్త కమిషనర్లుగా సుఖ్‌బీర్‌ సింగ్‌ సింధూ, జ్ఞానేశ్‌ కుమార్‌లను ఎంపిక చేసింది. 
 
ఈ మేరకు గురువారం కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. తాజాగా వీరు కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టారు. కేరళకు చెందిన కుమార్‌, ఉత్తరాఖండ్‌కు చెందిన సంధూ ఇద్దరూ 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారులు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన సందర్భంలో కుమార్‌ హోంమంత్రిత్వ శాఖలో సేవలు అందించగా, సంధూ గతంలో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిగా వ్య వహరించారు.  కాగా, ఎన్నికల కమిషనర్ల ప్రకియపై ఎంపిక కమిటీలో సభ్యుడైన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధరీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
 
మరోవంక, ఎలక్టోరల్​ బాండ్ల విషయంలో స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఎస్​బీఐ) కు తాజాగా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బాండ్లకు సంబంధించిన డోనర్లు, డబ్బులను రిడీమ్​ చేసుకున్న రాజకీయ పార్టీల వివరాలను వెల్లడించినప్పటికీ.. బాండ్​ నెంబర్లను ఎందుకు చెప్పలేదని? ప్రశ్నించింది. బాండ్​ నెంబర్లు వెల్లడించకపోవడంతో తమ తీర్పును పూర్తిగా అమలు చేయలేదని ఎస్​బీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. డోనర్లు, రాజకీయ పార్టీల మధ్య లింక్​గా వ్యవహరించే ఎలక్టోరల్​ బాండ్​ నెంబర్ల వివరాలను పబ్లీష్​ చేయాలని తేల్లిచెప్పింది.