రేపే లోక్​సభ, ఆంధ్రప్రదేశ్​ ఎన్నికల షెడ్యూల్​ విడుదల

యావత్​ భారత దేశం ఎదురుచూస్తున్న ఘట్టానికి సమయం ఆసన్నమైంది. 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు చెందిన షెడ్యూల్‌ను శ‌నివారం ప్ర‌క‌టించ‌నున్నారు. రేపు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు కేంద్రం ఎన్నిక‌ల సంఘం దీనిపై ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ది. దీంతో రేప‌టి నుంచే ఎన్నిక‌ల కోడ్ అమ‌లులోకి రానున్న‌ది.  లోక్‌స‌భ‌తో పాటు ప‌లు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల తేదీపై కూడా ప్ర‌క‌ట‌న వెలుబ‌డ‌నున్న‌ది.
ఈసారి నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఏప్రిల్ లేదా మే నెల‌లో ఓటింగ్ జ‌రిగే రాష్ట్రాల్లో అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒడిశా, సిక్కిం ఉన్నాయి.  కేంద్ర ఎన్నిక‌ల సంఘం సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫాముల్లో దిల్లీలోని విజ్ఞాన్​ భవన్​లో జరిగే ఈసీ  మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం కానున్న‌ది. మ‌హారాష్ట్ర‌, హ‌ర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల‌కు మాత్రం ఈ ఏడాది చివ‌ర్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.
చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మీష‌న‌ర్ రాజీవ్ కుమార్‌.. లోక్‌స‌భ ఎన్నిక‌ల తేదీల‌పై ప్ర‌క‌ట‌న చేస్తారు.  ఆ ప్రెస్‌మీట్‌లో కొత్త క‌మీష‌న‌ర్లు జ్ఞానేంద్ర కుమార్‌, సుఖ్బీర్ సింగ్ సంధూ కూడా పాల్గొంటారు. విజ్ఞాన్ భ‌వ‌న్‌లో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప్రెస్‌మీట్ జ‌ర‌గ‌నున్న‌ది. అయితే జ‌మ్మూక‌శ్మీర్‌కు జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ఈసీ ప్ర‌క‌ట‌న చేస్తుందా లేదా అన్న విష‌యంపై మాత్రం స్పస్టత లేదు.
2019లో ఎన్నిక‌ల సంఘం లోక్‌స‌భ ఎన్నిక‌ల‌ తేదీల‌ను మార్చి 10వ తేదీన ప్ర‌క‌టించిన విష‌యం తెలిసందే.  లోక్​సభలో మొత్తం 545 సీట్లు ఉంటాయి. వీటిల్లో 543 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్​ నుంచి మే మధ్య వరకు పోలింగ్​ ప్రక్రియ సాగుతుంది. సాధారణంగా మే చివరి వారంలో ఫలితాలు వెలువడతాయి. ఆంధ్రప్రదేశ్​లో మొత్తం 175 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మెజారిటీ ఫిగర్​ 88ని దాటాలి. జగన్ మోహన్ రెడ్డి​ నేతృత్వంలోని వైసీపీ ఇక్కడ ప్రస్తుతం అధికారంలో ఉంది.

ఒడిశాలో మొత్తం 147 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 74 స్థానాల్లో గెలవాలి. బీజేడీ అధినేత నవీన్​ పట్నాయక్ సుదీర్ఘ కాలంగా ఇక్కడ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈశాన్య భారత రాష్ట్రమైన సిక్కింలో మొత్తం 32 సీట్లు ఉన్నాయి. మెజారిటీ ఫిగర్​ 17గా ఉంది. ఎస్​కేఎం (సిక్కిం క్రాంతికారి మోర్చా)కు చెందిన ప్రేమ్​ సింగ్​ తమంగ్​ ఇక్కడ సీఎంగా ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో మొత్తం 57 సీట్లు ఉన్నాయి. మెజారిటీ మార్క్​ 31గా ఉంది. బీజేపీకి చెందిన ప్రేమ ఖండు ఇక్కడ సీఎంగా కొనసాగుతున్నారు.