ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా సైన్యాన్ని పంపితే అణుయుద్ధం తప్పదని రష్యా అధ్యక్షుడు పుతిన్ పశ్చిమ దేశాలను హెచ్చరించారు. మార్చి 15- 17 మధ్య రష్యా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బుధవారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ అకారణంగా ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలు ఉపయోగించాల్సిన అవసరం రష్యాకు లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఉక్రెయిన్‌కు అమెరికా తమ దళాలను పంపిస్తే, యుద్ధం మరింత జఠిలం అవుతుందని తెలిపారు.
“సాంకేతికంగా అణు యుద్దానికి రష్యా సిద్ధంగా ఉంది. కానీ అందుకు తొందరపడడం లేదు. మాకు కొన్ని విధి విధానాలున్నాయి. ఈ విషయం అమెరికాకు తెలుసు. ఒక వేళ ఉక్రెయిన్‌కు మద్దతుగా సైన్యాన్ని పంపితే యుద్ధంలో ఆ దేశం నేరుగా జోక్యం చేసుకున్నట్టే. దానికి తప్పకుండా బదులిస్తాం. రష్యా- అమెరికా మధ్య సంబంధాలను వ్యూహాత్మక చర్చలు జరిపేందుకు చాలా మంది నిపుణులు ఉన్నారు’ అని పుతిన్ వ్యాఖ్యానించారు.
ఉక్రెయిన్ యుద్ధంలో మానవ హనన ఆయుధాలను ఇప్పటి వరకు వినియోగించలేదని పుతిన్ స్పష్టం చేశారు. అణ్వాయుధాలు ఉన్నాయని, కానీ వాటి వినియోగించేందుకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని పేర్కొంటూ రష్యా సార్వభౌమత్వానికి ఏదైనా ప్రమాదం వాటిల్లితే అప్పుడు వెపన్స్ వాడుతామని ఆయన తెలిపారు. తమ వ్యూహాల్లో అన్నీ ఉన్నాయని, వాటినేమీ మార్చలేదని తేల్చి చెప్పారు.
ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు రష్యా సుముఖంగా ఉందని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. అయితే ఆ చర్చలు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా జరగాలని తెలిపారు. ఒకవేళ అమెరికా అణు పరీక్షలు చేపడితే, రష్యా కూడా వాటిని పరీక్షిస్తుందని పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైన తరువాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో పుతిన్ విజయంపై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఆసక్తిగా ఉన్నాయి.
మరోవైపు.. పుతిన్ వ్యాఖ్యలపై అమెరికా ఘాటుగా బదులిచ్చింది. అణు యుద్ధం ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలను బాధ్యతారహితంగా పేర్కొంది. పుతిన్ ఇలా మాట్లాడటం మొదటిసారి కాదని, అణ్వాయుధ రాజ్య నాయకుడు ఇలా మాట్లాడటం ఏమాత్రం సమంజసం కాదని విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ విచారం వ్యక్తం చేశారు. అణ్వాయుధ వినియోగం వల్ల ఎదురయ్యే పరిణామాల గురించి తాము గతంలోనే రష్యాతో ప్రైవేట్‌గా, ప్రత్యక్షంగా మాట్లాడామని గుర్తు చేశారు. అయితే, రష్యా అణ్వాయుధాన్ని ఉపయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు తమకు ఎలాంటి సంకేతాలు అందలేదని స్పష్టం చేశారు.
More Stories
2025లో ప్రమాదంలో 47 కోట్ల మంది పిల్లల భవిష్యత్తు
40 ఏళ్ల తర్వాత ట్రంప్ ప్రమాణ స్వీకార వేదిక మార్పు
మరణం నుంచి తృటిలో తప్పించుకున్నాను