డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ ల మధ్యనే మళ్లీ పోటీ

డెమొక్రటిక్ పార్టీ తరఫున ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం అధ్యక్ష నామినేషన్లను గెలుచుకున్నారు. దీంతో 2020 లో జరిగిన అధ్యక్ష ఎన్నికల మాదిరిగానే మరోసారి అధ్యక్ష ఎన్నికలు వీరిద్దరి మధ్యనే జరిగే అవకాశం కనిపిస్తోంది. అమెరికాలోని గ‌డిచిన 70 ఏళ్ల చ‌రిత్ర‌లో ఇద్ద‌రు అభ్య‌ర్థులు రెండోసారి మ‌ళ్లీ పోటీప‌డే అవ‌కాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి.

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సాధారణంగా, ప్రతీ నాలుగు సంవత్సరాలకు, నవంబర్ 5 వ తేదీన జరుగుతాయి.  జార్జియా, మిసిసిపీ, వాషింగ్టన్ స్టేట్ ల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో తమ తమ పార్టీల తరఫున డోనాల్డ్ ట్రంప్, జో బైడెన్ విజయం సాధించారు. ఉత్తర మరియానా దీవుల ప్రైమరీలో బిడెన్ 11 డెలిగేట్లను సాధించారు. 

అయితే, జార్జియాలో, గాజాలో యుద్ధంపై బైడెన్  ప్రభుత్వ వైఖరిపై ఓటర్లు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. బ్యాలెట్ లో ‘అన్ కమిటెడ్’ ఆప్షన్ లేకపోవడంతో కొందరు ఓటర్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేసేందుకు అసాధారణ మార్గాలను ఆశ్రయించారు.  డెమోక్ర‌టిక్ పార్టీ త‌ర‌పున బైడెన్ త‌న అభ్య‌ర్థిత్వాన్ని ఖ‌రారు చేసుకునేందుకు 1968 డిలీగేట్ల‌ను నెగ్గాల్సి ఉంటుంది.

అయితే నామినేష‌న్‌కు కావాల్సిన సంఖ్యా బ‌లాన్ని ఆయ‌న దాటివేసిన‌ట్లు ఎడిస‌న్ రీస‌ర్చ్ తెలిపింది. జార్జియా రాష్ట్రానికి చెందిన ప్రైమ‌రీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలుబ‌డ‌డంతో బైడెన్ రూట్ క్లియ‌ర్ అయ్యింది

మరోవైపు, జార్జియాలో ట్రంప్  విజయం ఏకపక్షంగా సాగింది. ఇతర అభ్యర్థులు బ్యాలెట్లో కనిపించినప్పటికీ, పోటీ నామమాత్రంగానే సాగింది. స్కాట్ కార్పెంటర్ వంటి కొద్ది మంది ట్రంప్  పట్ల ద్వేషం కారణంగా మాజీ రాయబారి నిక్కీ హేలీకి ఓటు వేశారు.  గ‌త మంగ‌ళ‌వారం జ‌రిగిన ప్రైమ‌రీలో ట్రంప్ త‌న ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించడంతో ఆ త‌ర్వాత రేసులో ఉన్న నిక్కీ హేలీ కూడా త‌ప్పుకున్నారు. దీంతో రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌పున ట్రంప్ త‌న నామినేష‌న్‌ను చేజిక్కించుకునే అవకాశం స్పష్టమైంది.

ప్రైమరీల్లో విజయం అనంతరం అమెరికా ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ అధ్యక్షుడు బైడెన్ ఒక ప్రకటన విడుదల చేశారు. నాలుగేళ్ల క్రితం తాను విజయం సాధించిన నాటి కన్నా ట్రంప్ విసురుతున్న ముప్పు ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉందని బైడెన్ హెచ్చరించారు. ఈ సమయంలో తన పార్టీపై, తనపై ఈ దేశాన్ని నడిపించడానికి మరోసారి విశ్వాసం ఉంచాలని అభ్యర్ధించారు.