హ‌ర్యానా కొత్త సీఎంగా న‌యాబ్ సింగ్ సైనీ

 
* సీఎం మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ ప‌ద‌వికి రాజీనామా
 
హరియాణా ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్​ నేత మనోహర్​ లాల్​ ఖట్టర్ 2024 లోక్​సభ ఎన్నికలకు ముందు తన పదవికి రాజీనామా చేయడం, వెంటనే  హ‌ర్యానా కొత్త ముఖ్యమంత్రిగా న‌యాబ్ సింగ్ సైనీ ఎన్నిక కావడం మంగళవారం చకచకా జరిగిపోయింది. సాయంత్రం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
 
మనోహర్​ లాల్​ ఖట్టర్  ఉదయం గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసి తన రాజీనామా లేఖను అందించారు. శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా న‌యాబ్ సింగ్ సైనీని ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన పేరును ఖట్టార్ ప్రతిపాదించారు. ఈ విష‌యాన్ని ఎమ్మెల్యే సుభాష్ సుధా తెలిపారు.
 
కురుక్షేత్ర‌కు చెందిన ఎంపీ సైనీ ఆ రాష్ట్రానికి బీజేపీ పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు. మనోహర్​ లాల్​ ఖట్టర్​ లోక్ సభ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేయవచ్చని భావిస్తున్నారు.  అధికార బీజేపీ- జేజేపీ (జననాయక్​ జనతా పార్టీ) మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరినట్టు వార్తలు వస్తున్న తరుణంలో ఖట్టర్​ రాజీనామా చేయడం గమనార్హం.
 
సైనీ జనవరి 25, 1970న అంబాలాలోని చిన్న గ్రామమైన మిజాపూర్ మజ్రాలో కుటుంబంలో జన్మించారు. ఆయన ముజఫర్‌పూర్‌లో బి.ఆర్‌. అంబేద్కర్ బీహార్ విశ్వవిద్యాలయం నుంచి బీఏ, ఎల్‌ఎల్‌బీ డిగ్రీలు పొందారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో చేరారు. ఆ తర్వాత మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలుసుకుని ప్రభావితమయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరి అంబాలా కంటోన్మెంట్‌లో అధ్యక్షుడితో సహా పార్టీలో అనేక పదవుల్లో పనిచేశారు.

హరియాణా సీఎంగా బిజెపి నేత మనోహర్​ లాల్​ ఖట్టర్​ ఉండగా, ఉప ముఖ్యమంత్రిగా పదవిలో జేజేపీ నేత దుశ్యంత్​ చౌతాలా కొనసాగుతున్నారు. అయితే 2024 లోక్​సభ ఎన్నికల విషయంలో వీరి మధ్య విభేదాలు నెలకొన్నట్టు తెలుస్తోంది. సీట్ల సద్దుబాటు విషయం ఇప్పటికీ ఒక కొలిక్కి రాకపోవడం గమనార్హం.

హరియాణా అసెంబ్లీలో మొత్తం 90 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కనీసం 46 సీట్లు కావాలి. 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 40 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్​ 31 చోట్ల గెలిచింది. దుశ్యంత్​ చౌతాలా జేజేపీకి 10 సీట్లు దక్కాయి. చివరికి ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, జేజేపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హరియాణాలో మొత్తం 10 లోక్​సభ సీట్లు ఉన్నాయి. 2019 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ 10 స్థానాల్లో గెలిచింది. జేజేపీ, కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు.