అమరావతి భూముల స్కామ్ లోచంద్రబాబుపై ఛార్జ్ షీట్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై  అమరావతి అసైన్డ్ భూముల స్కామ్ లో ఏపీ సీఐడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. రాజధాని ప్రాంతంలో మొత్తం రూ.4400 కోట్ల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగిందని సీఐడీ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ఈ స్కామ్ లో చంద్రబాబు ప్రధాన ముద్దాయిగా తెలిపింది. మాజీ మంత్రి నారాయణను మరో ముద్దాయిగా ఛార్జ్‌షీట్‌లో సీఐడీ పేర్కొంది.

అమరావతిలో 1100 ఎకరాల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగిని సీఐడీ ఛార్జ్ షీట్ లో తెలిపింది. అమరావతి రాజధాని ప్రాంతాంలో చంద్రబాబు, నారాయణ సహా మరికొందరు భారీగా భూదోపిడీకి పాల్పడినట్లు సీఐడీ అభియోగించింది. చంద్రబాబు, ఆయన బినామీలు అసైన్డ్ భూములను కాజేశారని సీఐడీ పేర్కొంది. భూరికార్డులను ట్యాంపరింగ్ చేసి భూముల కుంభకోణానికి పాల్పడినట్లు సీఐడీ నిర్ధారించింది.

చంద్రబాబు, నారాయణతో పాటు మాజీ తహసీల్దార్ సుధీర్ బాబు, రామక్రిష్ణ హౌసింగ్ లిమిటెడ్ ఎండీ అంజనీ కుమార్ ను సీఐడీ ముద్దాయిలుగా పేర్కొంది.  అమరావతి రాజధాని ప్రాంతంలోని అసైన్డ్ భూములను ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి బలవంతంగా లాక్కోవాలనే ఉద్దేశంతో అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ, ఇతర మంత్రులు, వారి బినామీలతో కలిసి కుట్ర చేశారని సీఐడీ అభియోగించింది. 

అసైన్డ్ భూయజమానులను భయపెట్టి ఆ భూములను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ల్యాండ్ పూలింగ్ కింద ఎలాంటి ప్యాకేజీ ప్రకటించకుండా తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేశారని పేర్కొంది. మందడం, వెలగపూడి, రాయపూడి, ఉద్దండరాయునిపాలెం గ్రామాల్లోని అసైన్డ్ భూములకు ల్యాండ్ పూలింగ్ కింద లబ్ధి చేకూర్చేందుకు జీఓలు 41 జారీ చేశారని తెలిపింది. 

అప్పటి అడ్వకేట్ జనరల్ సలహా ఇచ్చినా నిందితులు ఉద్దేశపూర్వకంగా భూములు లాక్కున్నారని అభియోగించింది. తమ ప్లాన్ ప్రకారం అప్పటి మంత్రులకు బినామీలుగా వ్యవహరించిన కొందరు పేదల అసైన్డ్ భూములను కొనుగోలు చేశారని సీఐడీ పేర్కొంది.

కొమ్మారెడ్డి బ్రహ్మానంద రెడ్డి, కేపీవీ అంజనీకుమార్, గుమ్మడి సురేష్, కొల్లి శివరాం, మంత్రుల కుటుంబ సభ్యులు కొందరు ఇలా కొనుగోలు చేసిన వారిలో ఉన్నారని సీఐడీ ఛార్జ్ షీట్ లో తెలిపింది. నిషేధిత జాబితాలోని అసైన్డ్ భూములపై రిజిస్ట్రేషన్లు, జిపిఎలను అనుమతించమని మంగళగిరిలోని సబ్-రిజిస్ట్రార్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారని తెలిపింది. 
 
దీనిపై మేజిస్ట్రేట్ ముందు సెక్షన్ 164 సీఆర్ పిసి కింద కేసు నమోదు చేశామని పేర్కొంది. మాజీ మంత్రి నారాయణ కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలు, కంపెనీల నుంచి ఎం/ఎస్‌ రామకృష్ణ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఇతర రియల్‌ ఎస్టేట్‌ మధ్యవర్తులతో రైతులకు చెల్లించిన దాదాపు రూ.16.5 కోట్లకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు లభించాయని తెలిపింది. 
 
నారాయణ తన బినామీల పేర్లతో అసైన్డ్ భూములు, అక్రమంగా విక్రయ ఒప్పందాలు చేసుకున్నారని చెప్పింది. దాదాపు 162 ఎకరాల అసైన్డ్ భూములను అక్రమంగా కొనుగోలు చేశారని సీఐడీ అభియోగించింది. చంద్రబాబు, నారాయణలకు రాజకీయంగా అనుబంధం ఉన్న మరికొందరు కూడా రాజధాని ప్రాంతంలో వందల ఎకరాల అసైన్డ్ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని సీఐడీ ఛార్జ్ షీట్ లో తెలిపింది.