ఢిల్లీకి వ్యాపిస్తున్న రైతుల ఆందోళనపై నిఘా వర్గాల హెచ్చరిక

* ఢిల్లీతో పాటు ఐదు రాష్ట్రాల పోలీసుల అప్రమత్తం

ఇప్పటి వరకు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల వరకే పరిమితం అవుతున్న రైతుల ఆందోళన ఢిల్లీకి వ్యాపించే అవకాశాలు ఉండడంతో నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దానితో ఢిల్లీతో పాటు ఐదు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ నెల 10న నాలుగు గంటల పాటు రైల్‌రోకో నిర్వహించాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. 

మరోవంక, ఈ నెల 14న రాంలీలా మైదాన్‌లో కిసాన్‌ మహా పంచాయత్‌ జరపాలని నిర్ణయించాయి. మొన్నటి వరకు ట్రాక్టర్లతో ఆందోళన చేపట్టిన రైతులు ప్రస్తుతం అందుకు భిన్నంగా ఢిల్లీకి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంటెలిజెన్స్‌ హెచ్చరికల నేపథ్యంలో రైలు, మెట్రోతో ఇతర రోడ్డు రవాణా మార్గాలు సైతం పోలీసు నిఘా రాడార్‌లోనే ఉన్నాయి. 

హర్యానా, పంజాబ్‌, యూపీ, రాజస్థాన్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశ రాజధాని వైపు రాకుండా అడ్డుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. హర్యానా, పంజాబ్‌కు చెందిన వేలాది మంది రైతులు శంభు, ఖానౌరీ సరిహద్దులకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ నుంచి సైతం రైతులు ఢిల్లీకి చేరుకుంటారని భావిస్తున్నారు. 

కేవలం బస్సులు, రైలు, మెట్రో ద్వారా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్దకు చేరుకోవాలని రైతులు భావిస్తున్నారు. కార్లు, జీపులు, చిన్న బస్సులు తదితర వ్యక్తిగత రవాణాను వినియోగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పోలీసులకు రైతులను అడ్డుకోవడం సవాల్‌గా మారనున్నది. 

జంతర్‌ మంతర్‌ వద్దకు రాకుండా అడ్డుకుంటున్నట్లుగా పోలీసులు చెప్పనప్పటికీ 144 సెక్షన్‌ విధించారు. నిరసనకు ఎవరినీ అనుమతించడం లేదు. అయితే, ఢిల్లీలోకి రైతులు ప్రవేశించాక అల్లకల్లోం సృష్టించే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు సమాచారం. ప్రధాని, హోంశాఖమంత్రితో పాటు పలువురు వీవీఐపీల ఇండ్ల ఎదుట నిరసన తెలిపే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు సమాచారం.

దానితో రైతుల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలోని అనేక మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమై ఢిల్లీకి రాకుండా నిఘా వేశారు. రైల్వే, మెట్రో, ప్రజా రవాణా బస్సుల్లో తనిఖీలు పెంచారు. ప్రైవేట్ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతించాలని అధికార వర్గాలు ఆదేశించినట్లు తెలస్తున్నది. 

రైతుల ఆందోళన నేపథ్యంలో పోలీసు, కేంద్ర బలగాలను అప్రమత్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీని ఆనుకొని ఉన్న సరిహద్దుల్లో ప్రత్యేకంగా నిఘా వేశారు. రైతులు బస చేసేందుకు వీలున్న ప్రదేశాల్లోనూ పోలీసులను మోహరించారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఢిల్లీలోని పలుచోట్ల 144 సెక్షన్‌ విధించారు.