మూడు ఫార్మాట్లలో నంబర్ వన్‍గా టీమిండియా

ఇండియన్ క్రికెట్ టీమ్ మరోసారి అరుదైన ఘనత సాధించింది. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లోని మూడు ఫార్మాట్‌లలో టీమిండియా అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇంగ్లండ్‌పై సిరీస్‌ను 4-1 తేడాతో గెలుపొందిన భారత్ ఐసీసీ పురుషుల టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి నెంబర్ వన్ ప్లేస్‌కు చేరుకుంది.

ర్యాంకింగ్స్ పట్టికలో ఇప్పుడు 122 రేటింగ్ పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఇక 117 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానం సంపాదించుకోగా,111 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లాండ్ మూడో స్థానంలో ఉంది. క్రైస్ట్‌చర్చ్‌లో న్యూజిలాండ్- ఆస్ట్రేలియా రెండో టెస్టు ఫలితంతో సంబంధం లేకుండా భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుంది.

 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 విజేత ఆస్ట్రేలియా ప్రస్తుతం వెల్లింగ్‌టన్‌లో 172 పరుగుల విజయంతో రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. దీంతో భారత్ ఇప్పుడు మూడు ఫార్మాట్లలో ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌కు 121 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా 118 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

అలాగే టీ20ల్లో భారత్‌ 266 రేటింగ్‌ పాయింట్లతో టాప్ ప్లేస్‌లో ఉంటే ఇంగ్లాండ్‌ (256) రెండో స్థానంలో ఉంది. సెప్టెంబరు 2023 నుంచి జనవరి 2024 వరకు ఇది పరిస్థితి. దక్షిణాఫ్రికాతో 1-1తో డ్రా అయిన తర్వాత టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్‌లో భారతదేశం రెండో స్థానానికి పడిపోయింది. స్వదేశంలో పాకిస్థాన్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఆస్ట్రేలియా టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్‌ను అధిగమించి అగ్రస్థానంలో నిలిచింది.

ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో కూడా టీమిండియా మొదటి స్థానంలో ఉంది. 68.5 విజయ శాతంతో టీమిండియా తొలి స్థానంలో ఉంది. రెండో ప్లేస్‌లో న్యూజిలాండ్ (60) ఉంది. ఈ టెస్ట్ ఛాంపియన్ షిప్ సైకిల్‌లో భారత్ ఇంకా ఐదు టెస్ట్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది.  బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది.

ఈ రెండు సిరీస్‌లనూ భారత్ గెలుచుకుంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్త్ ఖరారైనట్టే. కాగా, ప్రపంచ వన్డే ర్యాంకింగ్స్‌లో 121 పాయింట్లతో టీమిండియా అగ్ర స్థానంలో ఉంది. 118 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో ప్లేస్‌లో నిలిచింది. అలాగే ప్రపంచ టీ-20 ర్యాకింగ్స్‌లో 266 రేటింగ్ పాయింట్లతో టీమిండియా తొలి స్థానంలో ఉంది. 256 పాయింట్లతో ఇంగ్లండ్ సెకెండ్ ప్లేస్‌లో ఉంది.