ఈ నెల 15 లోగా ఎన్నికల కమిషనర్ల నియామకం!

అనుప్ చంద్ర పాండే పదవీ విరమణ, అరుణ్ గోయల్ ఆకస్మిక రాజీనామాతో ఎన్నికల కమిషన్‌లో ఏర్పడిన రెండు ఖాళీలను భర్తా చేయడానికి ఇద్దరు ఎన్నికల కమిషనర్లను ఈ నెల 15లోగా నియమించే అవకాశమున్నట్లు అధికార వర్గాలు ఆదివారం తెలిపాయి. 

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు అరుణ్ గోయల్ శనివారం ఎన్నికల కమిషన్ పదవికి హటాత్తుగా రాజీనామా చేయడం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన రాజీనామాను వెంటనే ఆమోదించడం తెలిసిందే. అంతకు ముందు మరో కమిషనర్ అరుణ్ చంద్ర పాండే ఫిబ్రవరి 14న పదవీ విరమణ చేశారు. 

దీంతో ముగ్గురు సభ్యులుండే ఎన్నికల కమిషన్‌లో ఇప్పుడు సిఇసి రాజీవ్ కుమార్ ఒక్కరే ఉన్నారు. కాగా ఈ ఖాళీలను ఖర్తీ చేయడానికి ముందుగా న్యాయశాఖ మంత్రి, హోం కార్యదర్శి, సిబ్బంది ,శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ( డిఒపిటి) కార్యదర్శితో కూడిన సెర్చ్ కమిటీ ఒక్కో పోస్టుకు అయిదుగురు పేర్లతో రెండు వేర్వేరు ప్యానెళ్లను సిద్ధం చేస్తుంది.

ఆ తర్వాత ప్రధానమంత్రి, న్యాయశాఖ మంత్రి, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరితో కూడిన సెలెక్షన్ కమిటీ ఆ ప్యానెళ్లనుంచి ఇద్దరు వ్యక్తులను ఎంపిక చేస్తుంది. ఆ తర్వాత రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్లను నియమిస్తారు. కాగా సెలెక్షన్ కమిటీ సభ్యుల వీలును బట్టి ఈ నెల 13 లేదా 14న సమావేశమై ఇద్దరు ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేస్తుందని అధికార వర్గాలు తెలియజేశాయి.