కేరళ స్కూల్లో ఏఐ టీచరమ్మ పాఠాలు

ప్ర‌స్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధ చుట్టూ తిరుగుతోంది. అన్ని రంగాల‌లో అర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) వినియోగం విస్తరిస్తోంది. మీడియా, మోడ‌లింగ్ ఇలా ప్ర‌తి చోట‌ ఏఐ ఆధారిత రోబోలు ప‌ని చేస్తున్నాయి. తాజాగా, విద్యారంగంలో కూడా కృత్రిమ మేధ ప్ర‌వేశించింది. కేర‌ళ‌లో ఏఐ టీచ‌రమ్మ విద్యార్థుల‌కు పాఠాలు బోధిస్తోంది.
కేర‌ళ రాజ‌ధాని తిరువ‌నంత‌పురంలోని కేటీసిటీ స్కూల్ యాజ‌మాన్యం త‌మ విద్యార్థుల‌కు ఏఐతో రూపొందిన రోబోను పాఠాలు చెబుతోంది. ఈ ఏఐ టీచ‌ర్‌కు ఐరిస్‌ అనే పేరు కూడా పెట్ట‌డం విశేషం. అట‌ల్ టింక‌రింగ్ ల్యాబ్ ప్రాజెక్ట్‌లో భాగంగా దీన్ని మేక‌ర్‌ల్యాబ్స్ ఎడ్యుటేక్ స‌హ‌కారంతో రూపొందించారు.

తిరువనంతపురంః చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్ రాక‌తో కొలువుల కోత త‌ప్పద‌నే ఆందోళ‌న వ్యక్తమ‌వుతోంది. ఇప్పటికే ప‌లు కంపెనీలు చాట్‌జీపీటీ సేవ‌ల‌ను వినియోగించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా న్యూ టెక్నాల‌జీ టీచ‌ర్లనూ రీప్లేస్ చేసేసింది. దేశంలోనే తొలి సారి ఏఐ ఆధారిత టీచరమ్మ కేరళలో ప్రత్యక్షమైంది. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఓ స్కూల్లో ఈ టెక్నాలజీ కలిగి ఉన్న మహిళా టీచర్‌ను ప్రవేశపెట్టారు. కొచ్చికి చెందిన ఓ స్టార్ట్అప్, మేకర్‌ల్యాబ్స్ అభివృద్ధి చేసిన ఏఐ టీచ‌ర్ అక్కడి పాఠశాలలో సేవ‌లు అందిస్తోంది. 

సంప్రదాయ చీర‌క‌ట్టులో అచ్చం మ‌హిళ గొంతుకతో ఐరిస్‌ పాఠాలు బోధిస్తుంటే విద్యార్థులు ఆస‌క్తిగా వింటున్నార‌ని పాఠ‌శాల యాజ‌మాన్యం చెబుతోంది. పిల్ల‌ల‌కు పాఠాలు అర్థ‌మ‌య్యేలా చెప్ప‌డమే కాదు.. వారి సందేహాల‌ను సైతం నివృత్తి చేస్తోంద‌ని మురిసిపోతున్నారు. ఇది బ‌హుభాష‌ల్లో మాట్లాడ‌గ‌ల‌ద‌ని రూప‌క‌ర్త‌లు వెల్ల‌డించారు. ఐరిస్‌ పాఠాలు చెబుతున్న వీడియోను మేక‌ర్‌ల్యాబ్స్ ఎడ్యుటేక్ సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేయ‌డంతో ప్రస్తుతం వైర‌ల్ అవుతోంది.

కాగా, మేకర్‌ల్యాబ్స్‌ ఎడ్యూటెక్‌ ప్రవేశపెట్టిన ఈ ఏఐ పంతులమ్మ పేరు ఐరిస్‌. మొత్తం మూడు భాషల్లో మాట్లాడగలదు. ఈ ఏఐ ఆధారిత టీచర్‌ దేశంలో మొట్టమొదటి మానవరూప రోబోట్‌ ఉపాధ్యాయురాలిగా నిలిచింది. నీతి ఆయోగ్ చొరవతో కడువాయిల్ తంగల్ ఛారిటబుల్ ట్రస్ట్, కేటీసీటీ హయ్యర్ సెకండరీ స్కూల్ సంయుక్తంగా ఈ ఆవిష్కరణ చేపట్టాయి. ఐరిస్ పలు సబ్జెక్టులకు సంబంధించిన క్లిష్టమైన ప్రశ్నలకు చాలా సులువుగా సమాధానాలు ఇస్తోంది. ఇది తనంతట తాను నడిచేలా చక్రాలను ఏర్పాటుచేశారు.