`రామేశ్వరం’ నిందితుడి ఆచూకీ చెబితే రూ.10 లక్షల రివార్డు

బెంగళూరులో గత వారం జరిగిన బాంబు పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడి ఆచూకీ ఇంకా లభించలేదు. ముష్కరుడి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మంగళవారం స్వీకరించింది. తాజాగా, నిందితుడి ఆచూకీ లేదా వివరాలు గానీ తెలియజేసిన వారికి రూ.10 లక్షల నజరానా ఇస్తామని ఎన్ఐఏ ప్రకటించింది. 
 
ఈ సమాచారం ఇచ్చినవారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది. రామేశ్వరం కేఫ్ పేలుడుకు సంబంధించిన ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతోంది. మార్చి 1న రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు సంభవించింది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో చోటుచేసుకున్న పేలుడులో పది మంది గాయపడ్డారు. పేలుడు పదార్థాలతో ఉన్న బ్యాగును కేఫ్‌లో గుర్తించారు. 
 
అక్కడ సీసీ కెమెరాలో నిందితుడి విజువల్స్ రికార్డ్ అయ్యాయి. మాస్క్‌, టోపీ, గ్లాసెస్ పెట్టుకుని పూర్తిగా ముఖం కనిపించకుండా కవర్ చేసుకున్నాడు. కేఫ్‌కి వచ్చిన నిందితుడు ఇడ్లీ ఆర్డర్ ఇచ్చి, ఆ తరవాత తన వెంట తెచ్చుకున్న బ్యాగ్‌ని అక్కడే చెట్టు దగ్గర వదిలేసి వెళ్లిపోయాడు. అనంతరం కాసేపటికే బాంబు పేలుడు జరిగింది.
 
కేఫ్‌లోనే దాదాపు 9 నిముషాల పాటు నిందితుడు ఉన్నట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను బట్టి తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో నిందితుడ్ని గుర్తిస్తామని అధికారులు ప్రకటించారు. పేలుడు ఘటన విచారణను ఎన్ఐఏకు అప్పగించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆదివారం ప్రకటన చేశారు. ఆ వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పేలుడు ఘటనను ఎన్ఐఏకు ఇస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.