‘మానస’ లో దంత వైద్య శిబిరం

జాతీయ దంత వైద్యుల దినోత్సవం సందర్భంగా బుధవారం ఓరల్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మానస చిన్నారుల ఆరోగ్య వైకల్యాల  అధ్యయన సంస్థ లో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ ఎన్ కె ఎస్ అరవింద్, డాక్టర్ ఆనిరుధ్  మాథుర్, డాక్టర్ సిరి చందన, వారి సహాయ సిబ్బంది ఈ వైద్య శిబిరం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా మానస మానసిక దివ్యాంగుల  ప్రత్యేక పాఠశాలలోని విద్యార్థులకు, వారి తల్లి దండ్రులకు, మానస సిబ్బందికి దంత వైద్య పరీక్షలు చేశారు. చిన్నారులకు ఉన్న దంత క్షయం, ఫ్లోరోసిస్, ఫ్రైయోరియా వంటి వివిధ దంత సమస్యలను గుర్తించారు. ఈ సందర్భంగా మానసిక దివ్యంగులైన పిల్లల దంత సంరక్షణ గురించి ప్రత్యేక సూచనలు, శిక్షణ పిల్లల తల్లిదండ్రులకు ఇచ్చారు. 
 
దంత సమస్యలు ఉన్న పేద విద్యార్థులకు ఓరల్ హెల్త్ ఫౌండేషన్ అఫ్ ఇండియా ఆధ్వర్యంలో అందుబాటు ధరలలో చికిత్స అందించగలమని ఫౌండేషన్ వారు పేర్కొన్నారు.  ఓరల్ హెల్త్ ఫౌండేషన్ గత మూడు సంవత్సరాలుగా దంత వైద్య రంగంలో పేద వారికి అన్నిరకాల దంత చికిత్సలు అందించేందుకు ప్రయత్నిస్తున్నది ఫౌండేషన్ కార్యదర్శి డాక్టర్ అనిరుధ్ మాథుర్ పేర్కొన్నారు. 
 
దంత ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించరాదని, దంత ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటం ద్వారా ఇతరత్రా ఆరోగ్య సమస్యలు రాకుండా నివారించుకోవచ్చని, ఆహారాన్ని చక్కగా నమిలి తినటం ద్వారా పోషక విలువలు శరీరానికి అందుతాయని, దంత సమస్యలు వచ్చినప్పుడు వెంటనే దంత వైద్యుల వద్ద పరీక్ష చేయించుకోవాలని ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ అరవింద్ సూచించారు. 
 
ప్రిన్సిపాల్ లక్ష్మి తమ సంస్థలో ఫిజియో థెరపీ, స్పీచ్ థెరపీ, మానసిక వికలాంగుల కోసం ప్రత్యేక పాఠశాల, న్యూరో డెవలప్‌మెంటల్ క్లినిక్, వికలాంగుల కోసం వృత్తి శిక్షణా కేంద్రం వంటి వివిధ సౌకర్యాలను ఉచితంగా కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మానస డైరెక్టర్ మెర్సీ మధురిమ, మానస సిబ్బంది, విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు.