ఉదయనిధి స్టాలిన్ కు సుప్రీంకోర్టు చివాట్లు

సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తమిళనాడు మంత్రి, డిఎంకె నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద  వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సోమవారం తప్పుపట్టింది. భావ ప్రకటనా స్వేచ్ఛను, వాక్ స్వాతంత్య్రాన్ని దుర్వినియోగం చేసిన తర్వాత మళ్లీ సుప్రీంకోర్టుకు ఎలా వస్తారని సుప్రీంకోర్టు ఆయనను ప్రశ్నించింది. 

మీరొక మంత్రి..మీ వ్యాఖ్యల పర్యవసానాలు మీకు తెలియదా? అని ఉదయనిధిని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ప్రశ్నించారు. మంత్రిగా ఉదయనిధి తన మాటలతో ఎదుర్కోబోయే పర్యావసానాలను తెలుసుకోవాలని పేర్కొంది. ఉద్రేకపూరిత వ్యాఖ్యలు చేసిన తర్వాత సుప్రీంను ఆశ్రయించడమేంటని ప్రశ్నించింది.

“రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) కింద మీ హక్కును దుర్వినియోగం చేస్తున్నారు. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల పర్యవసానాలు తెలుసా? మీరు సామాన్యులు కాదు. మంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా’’ అని సుప్రీంకోర్టు ప్రశ్నించి.. కేసు తదుపరి విచారణను మార్చి 15కి వాయిదా వేసింది.

తన వివాదాస్పద వ్యాఖ్యలపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను కలిపి ఒకే చోట విచారించాలని కోరుతూ ఉదయనిధి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ “మీరు(ఉదయనిధి) మీ హక్కులను దుర్వినియోగం చేశారు. .. మీరు ఏం మాట్లాడారో మీకు తెలుసు. వాటి పర్యవసానాలను కూడా మీరు గ్రహించి ఉండాలి. మీరు ఒక మంత్రిగా ఉన్నారు. సామాన్య వ్యక్తి కాదు” అని పేర్కొన్నారు. 

ఉదయనిధి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదన వినిపిస్తూ వివిధచోట్ల నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను కలిపి విచారణ చేయాలని కోరుతూ అర్నబ్ గోస్వామి, మొహమ్మద్ జుబేర్, తదితరుల కేసులను ఉటంకించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ తమ వద్దకు కాకుండా హైకోర్టుకు వెళ్లి ఉండాల్సిందని సూచించింది.

తాము అనేక కోర్టులలో పిటిషన్లు వేయవలసి ఉంటుందని, ఇది తమను ప్రయాసతో కూడిన పని అని సింఘ్వి చెప్పారు. ఇది విచారణ కన్నా ముందుగానే వేధింపుల వంటిదని ఆయన చెప్పారు. ఈ కేసుపై వచ్చేవారం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. 

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ 2023 సెప్టెంబర్‌లో సనాతన ధర్మాంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కుల వ్యవస్థ, వివక్షతపై ఆధారపడిన సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఆయన పిలుపునివ్వడం తీవ్ర దుమారాన్ని రేపింది. 

సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయం, సమానత్వానికి వ్యతిరేకంగా ఉంటుందని, కొన్నింటిని వ్యతిరేకించి ఊరుకోకూడదని, వాటిని నిర్మూలించాలని పిలుపునిచ్చారు. డెంగ్యూ, మలేరియా, దోమలు, కరోనా వంటి వాటిని వ్యతిరేకిస్తే సరిపోదని, పూర్తిగా నిర్మూలించాలని స్పష్టం చేశారు. 

ఆయన వ్యాఖ్యలపై తమిళ నాడు బీజేపీ మండిపడింది. స్పందించిన ఉదయనిధి స్టాలిన్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. బీజేపీ పంపే లీగల్ నోటీసులను ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పారు. దానితో ఈ వివాదం కాస్తా రాజకీయాలను హీటెక్కించి.. చివరికి సుప్రీం కోర్టు వరకు చేరింది. ఈ వ్యాఖ్యలను తప్పుపడుతూ అనేక చోట్ల ఆయనపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.