
గత 12 ఏండ్లలో దేశంలో డిజిటల్ లావాదేవీలు 90 రెట్లు పెరిగాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సాగే మొత్తం ఆన్‌లైన్ పేమెంట్స్‌లో 49 శాతం మనదేశంలోనే జరుగుతున్నాయని ముంబైలోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన డిజిటల్ చెల్లింపుల అవగాహన సదస్సులో తెలిపారు.
‘2012-13లో దేశంలో 162 కోట్ల రిటైల్ చెల్లింపులు డిజిటల్ పేమెంట్స్ అయితే, 2023-24 నాటికి 14,726 కోట్లకు పెరిగింది. అంటే గత 12 ఏండ్లలో డిజిటల్ పేమెంట్స్ సుమారు 90 రెట్లు పెరిగాయి. ప్రపంచవ్యాప్త డిజిటల్ చెల్లింపుల్లో దాదాపు 49 శాతం భారత్‌లోనే సాగుతున్నాయి` అని శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
యూపీఐ భారత్‌లో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగవంతమైన పేమెంట్స్ సిస్టమ్‌గా మారిందని తెలిపారు. `దేశీయంగా డిజిటల్ చెల్లింపుల్లో గణనీయమైన వృద్ధి నమోదు చేయడంలో యూపీఐ’దే కీలక పాత్ర. 2023లో జరిగిన ఆన్ లైన్ పేమెంట్స్‌లో 80 శాతం దీనిదే. 2017లో 43 కోట్ల యూపీఐ లావాదేవీలు జరగ్గా, 2023 నాటికి అది 11,761 కోట్లకు పెరిగింది. రోజూ సగటున 43 కోట్ల యూపీఐ పేమెంట్స్ సాగుతున్నాయి’ అని శక్తికాంత దాస్ చెప్పారు.
ఆదాయం పన్ను పేమెంట్స్, బీమా ప్రీమియం చెల్లింపులు, మ్యూచువల్ ఫండ్ పేమెంట్స్, ఈ-కామర్స్ లావాదేవీలకు అత్యధికులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లిస్తారు. వీటి ప్రాసెసింగ్ కోసం బ్యాంకులు వేర్వేరుగా పేమెంట్స్ అగ్రిగేటర్లతో ఒప్పందాలు కుదుర్చుకోవాలి.
ఖాతాదారులు ఈ తరహా పేమెంట్స్ చేయడానికి బ్యాంకులు, పేమెంట్స్ అగ్రిగేటర్ల మధ్య ఒప్పందం ఉండాలి. కానీ అన్నింటితో ఒప్పందాలు కుదుర్చుకోవడం అసాధ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీల నిర్వహణకు ఇంటరాపరెబుల్ పేమెంట్ సిస్టమ్ తేనున్నట్లు శక్తికాంత దాస్ చెప్పారు.
More Stories
కార్మిక చట్టాల అమలుకై ఐటి ఉద్యోగుల ఆందోళన
357 ఆన్‌లైన్ మనీ గేమింగ్ సైట్స్‌పై కేంద్రం కొరడా
డాలర్ ను బలహీనం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదు