బంగారం రుణాలు మంజూరుపై ఆర్‌బీఐ నిషేధం

ప్రముఖ ఫైనాన్స్ సంస్థ ఇండియన్ ఇన్ఫోలైన్ ఫైనాన్స్ లిమిటెడ్ తక్షణమే బంగారంపై రుణాల జారీని ఆపివేయాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. గోల్డ్ లోన్ విభాగంలో లోపాలు, అవకతవకలను గుర్తించిన క్రమంలో ఈ మేరకు ఈ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికైతే రుణ పోర్ట్ ఫోలియోపైనా, రుణ రికవరీపైనా ఎలాంటి ఆంక్షలు ఉండవని స్పష్టం చేసింది. 

2023, మార్చి 31న నిర్వహించిన తనిఖీల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటన చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.  ఇండియన్ ఇన్ఫోలైన్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థలో గతేడాది నిర్వహించిన తనిఖీల్లో ఆ సంస్థ బంగారం రుణాల మంజూరు విభాగంలో కొన్ని లోపాలు బయటపడ్డాయని ఆర్‌బీఐ తెలిపింది. 

బంగారాన్ని తాకట్టు పెట్టుకుని రుణాలు జారీ చేసే సమయంలో, వాటిని వేలం వేసే సమయంలో బంగారం స్వచ్ఛత, బరువులో గణనీయమైన వ్యత్యాసాలు గుర్తించామని పేర్కొంది. బంగారు ఆభరణాల బరువులో వ్యత్యాసాలు ఉండడం అనేది కచ్చితంగా నిబంధనల ఉల్లంఘనేనని పేర్కొంది. అలాగే వినియోగదారుల ప్రయోజనాలను దెబ్బతీయడమే అవుతుందని తెలిపింది.

 ప్రత్యేక ఆడిట్ నిర్వహించిన అనంతరం ఆంక్షలను సమీక్షిస్తామని ఆర్‌బీఐ పేర్కొంది. మరోవైపు గరిష్ఠంగా అనుమతించిన లోన్ టూ వాల్యూ నిష్పత్తిలోనూ ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించామని ఓ ప్రకటనలో తెలిపింది సెంట్రల్ బ్యాంక్. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ అనుమతించిన నగదు సేకరణలను మించిపోయిందని, అలాగే ప్రామాణిక వేలం ప్రక్రియకు కట్టుబడి ఉండడంలోనూ విఫలమైందని పేర్కొంది. 

వీటితో పాటు కంపెనీ వసూలు చేసే రుసుములలో పారదర్శకత లేదని గుర్తించినట్లు వెల్లడించింది. ఈ ఉల్లంఘనలు గుర్తించిన క్రమంలో కంపెనీ సీనియర్ మేనేజ్‌మెంట్, చట్టపరమైన ఆడిటర్స్ తో గత కొద్ది నెలలుగా ఆర్‌బీఐ వివిధ సందర్భాల్లో మావేశమైంది. పలు రకాల సమాచారం సేకరించింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్లు తమ దృష్టికి రాలేదని, దీంతో కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యాపార పరిమితులను తక్షణమే అమలులోకి తీసుకురావాల్సిన అవసరం ఏర్పడినట్లు పేర్కొంది.