ఎన్నికల బాండ్ల వివరాలకు గడువు కోరిన ఎస్బీఐ

ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించేందుకు జూన్‌ 30 వరకు గడువు ఇవ్వాలని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) సుప్రీంకోర్టును కోరింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానానికి తాజాగా అప్లికేషన్‌ పెట్టుకొన్నది.  2019, ఏప్రిల్‌ 12 నుంచి 2024, ఫిబ్రవరి 15 వరకు రాజకీయ పార్టీలకు విరాళాల కోసం 22,217 ఎలక్టోరల్‌ బాండ్లు జారీ చేశామని, వాటికి సంబంధించిన వివరాలు సమర్పించేందుకు సుప్రీంకోర్టు పెట్టిన మూడు వారాల గడువు సమయం సరిపోదని ఎస్బీఐ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. 
 
ఎలక్టోరల్‌ బాండ్ల జారీ ప్రతి దశ ముగింపులో రిడీమ్‌ అయిన బాండ్లను అధీకృత బ్రాంచ్‌లు ముంబైలోని ప్రధాన బ్రాంచ్‌లో డిపాజిట్‌ చేశామని పేర్కొన్నది.  రెండు వేర్వేరు సమాచారాలు ఉన్నందున, మొత్తంగా 44,434 సమాచార సెట్‌లను డీకోడ్‌ చేసి, సరిపోల్చాల్సి ఉంటుందని తెలిపింది. ఎలక్టోరల్‌ బాండ్ల స్కీమ్‌ను రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంటూ సుప్రీంకోర్టు ఆ పథకాన్ని గత నెల 15న కొట్టివేసిన విషయం తెలిసిందే. 
 
ఎన్నికల బాండ్ల జారీని ఎస్బీఐ వెంటనే నిలిపివేయాలని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఆదేశించింది. అదేవిధంగా 2019, ఏప్రిల్‌ 12 నుంచి రాజకీయ పార్టీలకు వచ్చిన ఎన్నికల బాండ్ల అన్ని వివరాలను (కొనుగోలు చేసినవారు, కొనుగోలు తేదీ, ఎంత మొత్తం కొనుగోలు చేశారు) మార్చి 6వ తేదీలోగా ఎస్బీఐ.. ఈసీకి సమర్పించాలని, మార్చి 13లోగా ఆ వివరాలను వెబ్‌సైట్‌లో ఈసీ ప్రచురించాలని ఆదేశాలు ఇచ్చింది. 
 
ఎలక్టోరల్‌ బాండ్ల స్కీమ్‌ అమలు సమాచార హక్కు ఉల్లంఘన అవుతుందని, క్విడ్‌ ప్రోకోకు దారితీసే ప్రమాదమూ ఉన్నదని న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. నల్లధనాన్ని కట్టడికి ఇదొక్కటే మార్గం కాదని అభిప్రాయపడింది. అయితే, ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను ఈసీ సమర్పించేందుకు గడువు పొడిగించాలని కోరుతూ ఎస్బీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని విపక్ష నేతలు వ్యతిరేకించారు. 
 
‘విరాళాల వ్యాపారాన్ని’ దాచిపెట్టేందుకు ప్రధాని మోదీ తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ తన ఎక్స్‌ పోస్టులో ఆరోపించారు. ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను తెలుసుకోవడం ప్రజల హక్కు అని సుప్రీంకోర్టు పేర్కొన్నదని, అయితే ఎన్నికలకు ముందు ఎస్బీఐ ఈ వివరాలను బహిరంగపరిచేందుకు ఎందుకు సిద్ధంగా లేదని ప్రశ్నించారు.

మరోవైపు ఎస్బీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించడం అనుమానాలను పెంచుతున్నదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. ఎస్బీఐ చర్య న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు.