నర్సింగ్‌ విద్యార్థిని హత్యపై రాజకీయ దుమారం

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ నర్సింగ్‌ విద్యార్థిని హత్యకు గురికావడం రాజకీయ దుమారం రేపుతోంది. దానికి తోడు మెక్సికోతో సరిహద్దు వివాదం అమెరికా రాజకీయాలను వేడెక్కిస్తోంది. దేశంలోకి అక్రమంగా వలసొచ్చిన వ్యక్తి చేతిలో ఇటీవల లేకెన్‌ రిలే (22) అనే నర్సింగ్‌ విద్యార్థిని హత్యకు గురైంది. 

దీనిపై రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ముందున్న దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా స్పందించారు. ఇటీవల టెక్సాస్‌లోని సరిహద్దుకు వెళ్లిన ఆయన అక్కడ చేసిన ప్రసంగంలో అధ్యక్షుడు బైడెన్‌పై విమర్శలు గుప్పించారు. దేశంలోకి అక్రమ వలసదారుల ప్రవేశం ఎక్కువ కావడానికి బైడెన్‌ చేతగానితనమే కారణమని మండిపడ్డారు. 

లేకెన్‌ రిలే తల్లిదండ్రులతో ట్రంప్‌ ఫోన్‌లో మాట్లాడారు. రిలేను తాను ఎన్నటికీ మరచిపోలేనని, ఆమె హత్య అంశాన్ని అధ్యక్షుడు బైడెన్‌ అసలే పట్టించుకోలేదని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి ఇప్పటికే తప్పుకున్న మరో నేత వివేక్‌రామస్వామి కూడా ఇదే విషయంపై ఘాటుగా స్పందించారు.

బైడెన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ పోలీసింగ్‌ యాక్ట్‌ బిల్లు పాస్‌ చేయడానికి బదులు లేకెన్‌ రిలే సెక్యూర్‌ ద బోర్డర్‌ బిల్లు పాస్‌ చేయాల్సిందని, దీని ద్వారా అక్రమ వలసదారులను వెనక్కి పంపి పోలీసులకు భారాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు. కాగా, లేకెన్‌ రిలే మార్నింగ్‌ వాక్‌కు వెళ్లినపుడు దుండగుడు ఆమెపై దాడి చేసి కిడ్నాప్‌ చేసి తీవ్రంగా గాయపరిచి హత్య చేశాడు.

ఈ దారుణ ఘటన అమెరికాలో ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతోంది. కాగా, ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా పార్టీల అధ్యక్ష అభ్యర్థులను నిర్ణయించే ప్రైమరీ ఎన్నికలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.