ఏ క్షణంలోనైనా కూలిపోనున్న హిమాచల్ కాంగ్రెస్ సర్కార్‌!

రాజ్యసభ ఎన్నికలతో హిమాచల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మొదలైన సంక్షోభం ఏ క్షణంలోకూలిపోయే స్థితికి వచ్చింది. ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు సర్కార్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల పదవికి రాజీనామా చేసి బుజ్జగింపులతో వెనక్కి తగ్గిన మంత్రి విక్రమాదిత్య సింగ్‌ శనివారం తన ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌లో అధికారిక హోదాను తీసేసి  ‘హిమాచల్‌ సేవకుడి’ని అని రాసుకొచ్చారు. 
 
దీంతో ఆయన కొత్త పార్టీ పెడుతున్నట్టు జాతీయ మీడియాలో పెద్దయెత్తున వార్తలు వచ్చాయి. ఇదే విషయమై సీఎం సుఖును మీడియా ప్రశ్నించగా తనకు అటువంటి సమాచారం ఏదీలేదని పేర్కొన్నారు.  ఒకవైపు సర్కారులో సంక్షోభం కొనసాగుతుండగానే శనివారం క్యాబినేట్‌ భేటీ జరిగింది. 
 
అయితే సమావేశం మధ్యలో నుంచి విద్యామంత్రి రోహిత్‌ ఠాకూర్‌ ఒకింత అసహనంతో వేగంగా బయటకు రావడం సంచలనంగా మారింది. బయటకు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. భేటీ మధ్యలో నుంచి బయటకు రావడానికి గల కారణాన్ని ఠాకూర్‌ మీడియాకు వెల్లడించనప్పటికీ మంత్రి ఇంతలో కలుగజేసుకొన్న డిప్యూటీ సీఎం ముకేశ్‌ అగ్నిహోత్రి సమావేశానికి తిరిగి రావాల్సిందిగా ఠాకూర్‌ను కోరారు.
 
 ఇదిలాఉండగా కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలోకి రావాలనుకొంటున్నట్టు సీఎం సుఖు చేసిన వ్యాఖ్యలను అనర్హతవేటును ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యే రాజేందర్‌ రాణా ఖండించారు. మరో 9 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ కోటరీతో టచ్‌లో ఉన్నట్టు సంచలన ప్రకటన చేశారు.  “ప్రజలను మభ్యపెట్టడానికి సిఎం తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. మేం కాంగ్రెస్‌లోకి తిరిగి వెళ్లాలనుకోవడం లేదు. కాంగ్రెస్‌ పార్టీ నుంచే మరో 9 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్‌ సర్కారు కాదని, సుఖూ మిత్రుల సర్కారు” అని ఆయన స్పష్టం చేశారు.
 
హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజల గౌరవాన్ని నిలబెట్టడానికే మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే అభ్యర్థులెవరూ రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌కు లేరా? రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎవరూ లేరన్నట్లుగా బయటి వ్యక్తి అయిన అభిషేక్‌ మనుసింఘ్వీని ఇక్కడ రాజ్యసభ అభ్యర్థిగా బరిలో దించారు. దాన్ని వ్యతిరేకిస్తూ మేము బిజెపి అభ్యర్థికి ఓటేశామని రాణా చెప్పారు.
 
కాగా.. 68 స్థానాలున్న హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీకి 2022లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌-40, బీజేపీ-25, స్వతంత్రులు-3 స్థానాలు గెలుచుకున్నారు. తాజాగా రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడటంతో కాంగ్రెస్‌ బలం 34కు తగ్గిన్నట్లెంది.