195 మందితో బీజేపీ లోక్‌స‌భ అభ్య‌ర్ధుల తొలి జాబితా

* వారణాసి నుంచి మోదీ, గాంధీనగర్ నుంచి అమిత్ షా

2024 లోక్ సభ ఎన్నికల కోసం 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ శనివారం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి నుంచి పోటీ చేస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే ప్రకటించారు. అలాగే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్ లోని గాంధీ నగర్ నుంచి పోటీ చేస్తున్నారని వెల్లడించారు. యూపీలోని ల‌క్నో నుంచి రక్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, అమేథి నుంచి మ‌రోసారి స్మృతి ఇరానీ బ‌రిలో దిగ‌నున్నారు.

గ‌తంలో రాజ్య‌స‌భకు ఎన్నికైన ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వీయ గుజ‌రాత్‌లోని పోర్ బంద‌ర్ నుంచి పోటీ చేయనున్నారు. ఢిల్లీ నుంచి ప్ర‌వీణ్ ఖండేల్వాల్‌, మ‌నోజ్ తివారీ, సుష్మా స్వ‌రాజ్ కుమార్తె బ‌న్సూరి స్వ‌రాజ్ బ‌రిలో నిల‌వ‌నున్నారు. జ్యోతిరాదిత్య సింధియా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని గుణ స్ధానం నుంచి, రాజ్య‌స‌భ ఎంపీ భూపీంద‌ర్ యాదవ్‌ అళ్వార్ నుంచి లోక్‌స‌భ ఎన్నిక‌ల పోరులో దిగ‌నున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌ను విదిశ నుంచి లోక్‌స‌భ బ‌రిలో నిలిపారు.

ఇక తొలి జాబితాలో 34 మంది కేంద్ర మంత్రుల‌కు అవ‌కాశం ల‌భించ‌గా 28 మంది మ‌హిళ‌ల‌కు చోటు ద‌క్కింది. ఇద్ద‌రు మాజీ సీఎంల‌కు అవ‌కాశం క‌ల్పించారు. 57 మంది ఓబీసీల‌కు తొలి జాబితాలో స్ధానం క‌ల్పించారు. తొలి జాబితాలో యువ‌త‌కు 47 స్ధానాలు, ఎస్సీలకు 27, ఎస్టీల‌కు 18 స్ధానాల‌ను కేటాయించామ‌ని పార్టీ నేత వినోద్ తావ్డే తెలిపారు. 

కీల‌క యూపీ నుంచి 51 మంది అభ్య‌ర్ధుల‌ను తొలి జాబితాలో ప్ర‌క‌టించారు. ప‌శ్చిమ బెంగాల్ నుంచి 20 మంది, ఢిల్లీ నుంచి బ‌రిలో నిలిచే 5గురి పేర్ల‌ను తొలి జాబితాలో వెల్ల‌డించారు. ఇక తెలంగాణ నుంచి 9 మంది ఎంపీ అభ్య‌ర్ధుల‌కు తొలి జాబితాలో చోటు ద‌క్కింది. అరుణాచల్ వెస్ట్ నుంచి కిరణ్ రిజిజు, దిబ్రూగఢ్ నుంచి సర్బానంద సోనోవాల్, ఈశాన్య ఢిల్లీ నుంచి మనోజ్ తివారీ, న్యూఢిల్లీ నుంచి బన్సూరి స్వరాజ్, గాంధీనగర్ నుంచి అమిత్ షా, పోర్ బందర్ నుంచి మన్సుఖ్ మాండవీయ, నవ్సారి నుంచి సీఆర్ పాటిల్, గొడ్డా నుంచి నిషికాంత్ దూబే ఉన్నారు. 

త్రిస్సూర్ నుంచి సురేష్ గోపి, పతనంతిట్ట నుంచి అనిల్ ఆంటోనీ, తిరువనంతపురం నుంచి రాజీవ్ చంద్రశేఖర్, గుణ నుంచి జ్యోతిరాదిత్య సింధియా, విదిశ నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్, బికనీర్ నుంచి అర్జున్ మేఘ్వాల్, అల్వార్ నుంచి భూపేంద్ర యాదవ్, జోధ్ పూర్ నుంచి గజేంద్రసింగ్ షెకావత్, కోటా నుంచి ఓం బిర్లా తదితర బీజేపీ సీనియర్లు పోటీలో నిలుస్తున్నారు.

కీలకమైన 2024 లోక్ సభ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. అభ్యర్థులను ప్రకటించడానికి ముందు పార్టీ అభ్యర్థుల వడపోతపై భారీ కసరత్తును నిర్వహించింది. సిట్టింగ్ ఎంపిల పనితీరును క్షుణ్ణంగా సమీక్షించారు. చివరగా పార్టీ సీఈసీ సమావేశంలో తుది జాబితాపై నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 స్థానాలు, ఎన్డీఏ 400 స్థానాలు గెలుపొందాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.