గూగుల్‌పై రూ.18,850 కోట్లకు దావా

అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్‌పై 32 మీడియా గ్రూపులు 2.1 బిలియన్‌ యూరోల (రూ.18,857 కోట్ల)కు దావా వేశాయి. గూగుల్‌ డిజిటల్‌ అడ్వైర్టెజింగ్‌ విధానాల వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని ఆ గ్రూపులు ఆరోపించాయి. వాటిలో ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, చెక్‌ రిపబ్లిక్‌, డెన్మార్క్‌, హంగరీ, లక్సెంబర్గ్‌, నెదర్లాండ్స్‌, నార్వే, పోలెండ్‌, స్పెయిన్‌, స్వీడన్‌ తదితర దేశాలకు చెందిన ప్రచురణా సంస్థలు ఉన్నాయి. 
 
గూగుల్‌ తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేస్తూ అనైతిక విధానాలకు పాల్పడుతున్నదని, దీంతో మార్కెట్‌లో పోటీ తగ్గి తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నదని ఆ కంపెనీలు పేర్కొన్నాయి.  గూగుల్‌ అనైతిక విధానాలకు పాల్పడకపోతే అడ్వైర్టెజింగ్‌ ద్వారా తమ రాబడులు గణనీయంగా పెరిగేవని, ఆ నిధులను తిరిగి యూరోపియన్‌ మీడియా రంగం బలోపేతానికి వెచ్చించేందుకు వీలయ్యేదని వివరించాయి. 
 
కాగా, యాపిల్‌, మొజిల్లా లాంటి కంపెనీలకు చెల్లింపులు జరిపి గూగుల్‌ తన సెర్చింజన్‌ను డిఫాల్ట్‌ సెర్చింజన్‌గా ఉంచడం ద్వారా మార్కెట్‌లో పోటీని అణిచివేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తడంతో యాంటీట్రస్ట్‌ రెగ్యులేటర్లు ఇప్పటికే గూగుల్‌పై దృష్టి సారించారు.