మ‌హ‌దేవ్ బెట్టింగ్ యాప్ కేసులో రూ. 580 కోట్ల ఆస్తుల స్వాధీనం

మహ‌దేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి ఈడీ శుక్ర‌వారం రూ. 580.78 కోట్ల విలువైన ఆస్తుల‌ను స్వాధీనం చేసుకుంది. మ‌హ‌దేవ్ యాప్ కార్య‌క‌లాపాలు దుబాయ్ నుంచి నిర్వ‌హిస్తున్నార‌ని ఈడీ వెల్ల‌డించింది. మ‌హ‌దేవ్ యాప్‌తో కుమ్మ‌క్కై మ‌నీ ల్యాండ‌రింగ్ నెట్‌వ‌ర్క్స్ సాగిస్తున్నార‌నే అనుమానంతో 15 ప్రాంతాల్లోని ప‌లువురు వ్య‌క్తుల‌పై దాడులు చేప‌ట్టిన అనంత‌రం ఈడీ పెద్ద‌మొత్తంలో ఆస్తుల‌ను స్వాధీనం చేసుకుంది.

కోల్‌క‌తా, గురుగ్రాం, ఢిల్లీ, ఇండోర్‌, ముంబై, రాయ్‌పూర్‌లో ఈడీ దాడులు చేప‌ట్టింది. దాడుల సంద‌ర్భంగా రూ. 1.86 కోట్ల న‌గ‌దు, రూ. 1.78 కోట్ల విలువైన వ‌స్తువుల‌తో పాటు నేరం ద్వారా ఆర్జించిన రూ. 580 కోట్ల విలువైన ఆస్తుల‌ను ఈడీ స్తంభింప‌చేసింది. మ‌హ‌దేవ్ యాప్ కేసులో ప్ర‌ధాన ప్ర‌మోట‌ర్లు సౌర‌వ్ చంద్రార్క‌ర్‌, ర‌వి ఉప్ప‌ల్‌కు వ్య‌తిరేకంగా ఓ చార్జిషీట్‌తో పాటు ఈడీ రెండు చార్జిషీట్ల‌ను దాఖ‌లు చేసింది.

ఇంట‌ర్‌పోల్ రెడ్ కార్న‌ర్ నోటీస్ ఆధారంగా ఇద్ద‌రు ప్ర‌మోట‌ర్ల‌ను ఇటీవ‌ల దుబాయ్‌లో అదుపులోకి తీసుకున్నారు. వారిని భార‌త్‌కు అప్ప‌గించేలా ఈడీ క‌స‌ర‌త్తు సాగిస్తోంది. తొలి చార్జిషీట్‌లో చంద్రాక‌ర్ ర‌స్ అల్ ఖైమాలో త‌న పెండ్లికి ఏకంగా రూ. 200 కోట్లు వెచ్చించాడ‌ని ఈడీ ఆరోపించింది. చంద్రార్క‌ర్ బంధువుల కోసం ప్రైవేట్ జెట్స్‌ను బుక్ చేశార‌ని, సెల‌బ్రిటీల పెర్ఫామెన్స్ కోసం పెద్ద మొత్తం ఖ‌ర్చుచేశార‌ని పేర్కొంది. ఈ కేసులో మొత్తం రూ. 6000 కోట్ల వ‌ర‌కూ అక్ర‌మ లావాదేవీలు జ‌రిగాయ‌ని ఈడీ గుర్తించింది.