బీజేపీలో చేరిన బిఆర్ఎస్ ఎంపీ పోతుగంటి రాములు

పార్లమెంట్ ఎన్నికల వేళ  నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న పోతుగంటి రాములు గురువారం ఢిల్లీ వేదికగా బీజేపీలో చేరారు. జెడ్పీటీసీగా ఆయన కుమారుడు భరత్ కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. గతంలో టీడీపీలో ఉన్న ఆయన ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.
న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు భారతీయ జనతా పార్టీలో చేరారు.  ఆయన కుమారుడైన భరత్ కల్వకుర్తి జడ్పీటీసీగా కూడా ఉన్నారు. అప్పట్లో ఆయన కుమారుడు భరత్ ను జెడ్పీ ఛైర్మన్ గా చేసేందుకు కూడా పావులు కదిపారు రాములు. కానీ పార్టీలోని పలువురు నేతల నుంచి అభ్యంతరాలు రావటంతో అప్పట్నుంచి అసంతృప్తిగానే ఉన్నారు రాములు.

గతేడాది చివర్లో జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తన కుమారుడిని అచ్చంపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ అధినాయకత్వం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాల్ రాజుకే సీటు ఖరారు చేసింది. దీంతో పార్టీ తీరుపై తీవ్రమైన అంసతృప్తితో ఉన్న రాములు పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.

అయితే తాజాగా నాగర్ కర్నూల్ ;పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నిర్వహించిన పార్టీ సన్నాహక సమావేశంలో ఆయన కనిపించలేదు. ఈ సమావేశంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్ హాజరయ్యారు.  ఇదిలావుండగా, అచ్చంపేట బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, రాములు మధ్య విభేదాలు ఇటీవల కాలంలో తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఆ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా బాలరాజు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

ఎంపీ రాములు బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతారనే చర్చ మొదట్లో వినిపించింది. ఇప్పటికే మందా జగన్నాథం కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఆయన నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ను ఆశిస్తున్నారు.

రాములు కూడా టికెట్ ఖరారుపైనే ఆశలు పెట్టుకున్నారని, మరోసారి బరిలో ఉండాలని చూస్తున్నారని సమాచారం. కానీ కాంగ్రెస్ లో మల్లు రవి, జగన్నాథం, సంపత్ కుమార్ రేసులో ఉన్నారు. తీవ్రమైన పోటీ నేపథ్యంలో రాములుకు టికెట్ దక్కకపోవచ్చన్న చర్చ కూడా  వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే  రాములు బీజేపీలో చేరినట్లు తెలుస్తుంది.

బీజేపీలో సిట్టింగ్ ఎంపీ రాములు చేరిన నేపథ్యంలో ఎస్సీ రిజర్వ్ డు నియోజకవర్గమైన నాగర్ కర్నూల్ నుంచి మరోసారి ఆయన బరిలో ఉండే అవకాశం ఉంది. ఆయన ఒకవేళ పోటీలో ఉండకపోతే ఆయన కుమారుడు భరత్ కు అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది.  ఇప్పటికే పెద్దపల్లి బిఆర్ఎస్ ఎంపీ నేతకాని వెంకటేశ్ కూడా పార్టీని వీడి కొద్దిరోజుల కిందట కాంగ్రెస్ పార్టీలో చేరారు. జహీరాబాద్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కూడా పార్టీ మారే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారని సమాచారం.