రూ.5 కోట్ల జీఎస్‌టీ దాటితే ఇ- చలాన్ ఇవ్వాల్సిందే

వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)కి సంబంధించి మార్చ్1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రాబోతున్నాయి. ముఖ్యంగా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మధ్య వ్యాపారం కొనసాగించే వారు రూ.5 కోట్లు అంత కంటే ఎక్కువ టర్నోవర్ ఉంటె ఇప్పుడు ఇ- చలాన్ తప్పకుండా ఇవ్వాలి. ఇ- చలాన్ ఇవ్వకుండా ఇ-వే బిల్లు జారీ చేయలేరు. 
 
మార్చి 1 నుంచి అన్ని రకాల వ్యాపార లావాదేవీలకు ఈ నిబంధన వర్తిస్తుంది. జీఎస్‌టీ పన్ను విధానంలో రూ.50 వేలు అంత కంటే ఎక్కువ విలువైన వస్తువులను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఎగుమతి చేస్తున్నప్పుడు ఈ-వే బిల్లు అనేది తప్పనిసరి. అయితే, ఈ కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత ఈ -వే బిల్లు జారీ చేయడం మరింత కఠినతరం కానుంది.
 
చాలా మంది వ్యాపారులు బీ2బీ, బీ2ఈ పన్ను చెల్లింపుదారులతో ఇ-ఇన్‌వాయిస్‌లతో లింక్ చేయకుండానే ఇ-వే బిల్లులు జారీ చేస్తూ లావాదేవీలు జరుపుతున్నట్లు కేంద్ర జాతీయ సమాచార కేంద్రం ఎన్ఐసీ గుర్తించింది. ఈ పన్ను చెల్లింపుదారులందరూ ఇ-చలాన్లకు అర్హులుగా పేర్కొంది. 
 
ఈ కారణంగా కొన్ని సందర్భాల్లో ఇ-వే బిల్లులు, ఇ-చలాన్ల నమోదు సమాచారం సరిపోలడం లేదు. లెక్కల్లో తేడా గమనించిన క్రమంలో ఇ-వే బిల్లు, ఇ-చలాన్ స్టేట్‌మెంట్ పై కేంద్రం దృష్టి సారించింది. దీంతో జీఎస్‌టీ పన్ను చెల్లింపుదారులు మార్చి 1, 2024 నుంచి ఇ-చలాన్ స్టేట్‌మెంట్ లేకుండా ఇ-వే బిల్లు జారీ చేయవద్దని కోరింది.
 
దీంతో రూ.5 కోట్లు ఆపైన టర్నోవర్ ఉన్న వ్యాపారులు ఇ-వే బిల్లును రూపొందించడానికి ఇ- చలాన్ స్టేట్‌మెంట్ తప్పనిసరిగా సిద్ధం చేయాల్సి ఉంటుంది. అలాగే కస్టమర్లు లేదా నాన్ సప్లయర్లతో ఇతర ట్రాన్సాక్షన్లకు ఇ-వే బిల్లు మునుపటిలా పని చేస్తుందని కేంద్రం వెల్లడించింది. దేశంలో 2017, జులై 1వ తేదీన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం జీఎస్‌టీ పన్ను విధానాన్ని తీసుకొచ్చింది. దేశంలోని అన్ని పరోక్ష పన్నులను ఒకే చోట ఏకీకృతం చేసేందుకు ఈ వ్యవస్థను ప్రవేశపెట్టింది.