డబ్ల్యుటిఓ చర్చల్లో భారత్ ప్రయోజనాలు కాపాడాలి

అబుదాబిలో ఈ నెల 26 నుంచి 29 వరకు జరుగుతున్న ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ) ద్వైవార్షిక మంత్రుల సమావేశంలో వాణిజ్యం, వ్యాపారం రంగాలకు సంబంధించి జరిగే చర్చల్లో భారత దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడే విధంగా ఉండాలని స్వదేశీ జాగరణ్ మంచ్ (ఎస్ జె ఎం),  డిమాండ్ చేసింది. 
 
భారత ప్రతినిధివర్గం జరిపే ఏ చర్చలలో అయినా, సంతకాలు చేసే ఒప్పందాలలో అయినా దీర్ఘకాలిక భారత దేశాల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోవాలని ఈ సమావేశాలలో పాల్గొంటున్న జాగరణ్ మంచ్ దక్షిణ భారత సహా కన్వీనర్ డా. ఎస్ లింగమూర్తి సూచించారు. ఈ సమావేశాలలో భారత ప్రతినిధి వర్గానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వం వహిస్తున్నారు.
 
ఈ సమావేశంలో ప్రపంచ వ్యాప్తంగా 90 శాతం ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 164 సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులు వస్తువుల దిగుమతులు, ఎగుమతులకు సంబంధించి అనేక వాణిజ్య సమస్యలపై సమాలోచనలు జరుపుతారు. ఈ చర్చలలో ఏదేమైనా ఆహార భద్రత, ఆహారం నిర్లవలతో పాటు ఆహార సబ్సిడీలను కాపాడ వలసిందే వనే స్వదేశీ జాగరణ్ మంచ్ స్పష్టం చేసింది.
 
ప్రస్తుతం డబ్ల్యుటిఓ వ్యవసాయం పరిధిలో లేని మత్స్య రంగాన్ని దీని పరిధిలోకి తీసుకొచ్చేందుకు భారీ కార్పొరేట్లు చేసే ఎటువంటి ప్రయత్నాలనైనా భారత్ అనుమతిపకూడదని డిమాండ్ చేశారు. భారత్ వంటి అభివృద్ధి చెందిన దేశాల నుండి కార్మికులు, వృత్తిపర నిపుణులు అభివృద్ధి చెందిన దేశాలకు తేలికగా వెళ్లేందుకు వీలుగా అభివృద్ధి చెందిన దేశాలు సేవారంగం వీసా నిబంధనలను సరళీకృతం చేసేవిధంగా భారత్ వత్తిడి తీసుకు రావాలని డా. లింగమూర్తి కోరారు
 
అబుదాబిలో వివిధ దేశాలకు చెందిన ఎన్జీఓలతో  సమన్వయం, సహకారం ద్వారా ఆహార భద్రత,చేపలు పెట్టేవారి హక్కులు, జీవనోపాధి వంటి అంశాలతో పాటు పర్యావరణ సమస్యలు, భద్రతా అంశాలు, వీసా సమస్యల విషయంలో ఉమ్మడిగా వ్యవహరిస్తూ దక్షిణ -దక్షిణ సహకారం పెంపొందింప చేసేందుకు వీలుగా కృషి చేసేందుకు స్వదేశీ జాగరణ్ మంచ్ ప్రతినిధివర్గం ఈ సమావేశాలలో పాల్గొంటున్నది. 12 మంది గల మంచ్ ప్రతినిధివర్గంలో వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఉన్నారు.