రూ. 100లకే క్యాన్సర్ నిరోధక టాబ్లెట్!

ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రముఖ క్యాన్సర్‌ పరిశోధన చికిత్సా సంస్థ రెండవసారి క్యాన్సర్‌ పునరుద్ధరణను నిరోధించే చికిత్సను కనుగొన్నట్లు ప్రకటించింది. వంద రూపాయలకే ఈ టాబ్లెట్‌ అందుబాటులో ఉంటుందని పరిశోధన బృందంలో భాగమైన టాటా మెమోరియల్‌ హాస్పిటల్‌ సీనియర్‌ క్యాన్సర్‌ సర్జన్‌ డాక్టర్‌ రాజేంద్ర బద్వే వెల్లడించారు. 
 
దీని వెనుక పరిశోధకులు, వైద్యుల పదేళ్ల కృషి దాగి ఉందని తెలిపారు. ఈ టాబ్లెట్‌ రోగులలో రెండవసారి క్యాన్సర్‌ రాకుండా నిరోధించగలదని, రేడియేషన్‌, కీమోథెరపీ వంటి చికిత్స వల్ల వచ్చే దుష్ప్రభావాలను 50 శాతం దాకా ఇది తగ్గించగలదని, రెండవ సారి కేన్సర్‌ను నివారించడంలో 30శాతం ప్రభావవంతంగా ఉంటుందని ఆయన తెలిపారు.
 
 ప్యాంక్రియాస్‌, ఊపిరి తిత్తులు, నోటి కేన్సర్‌పై కూడా ప్రభావవంతంగా పని చేస్తాయని వెల్లడించారు. పరిశోధన కోసం ఎలుకలపై దీనిని మొదట ప్రయోగించి చూడగా ఫలితాలు బాగా ఉన్నాయని డాక్టర్‌ రాజేంద్ర బద్వే తెలిపారు.ఆ ప్రయోగ వివరాలను తెలుపుతూ .ఎలుకలోకి మానవ కేన్సర్‌ కణాలను ప్రవేశపెడతారు. ఆ కణాలు వాటిలో కణితిని ఏర్పరుస్తాయి. అప్పుడు కీమో థెరప,ఈ రేడియేషన్‌ థెరపీ వంటివి చేస్తారు. 
 
ఈ కేన్సర్‌ కణాలు చనిపోయినప్పుడు అవి చిన్న ముక్కలుగా విడిపోయి (వీటిని క్రోమాటిక్‌ కణాలని అంటారు) రక్త నాళాల ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తాయి. ఆరోగ్యకరమైన కణాలలోకి అవి ప్రవేశించినప్పుడు వాటిని కేన్సర్‌గా మార్చే అవకాశముంది. కొన్ని క్రోమాటిక్‌ కణాలు ఆరోగ్యకరమైన క్రోమోజోములతో కలసి కొత్త కణితులకు కారణం కావచ్చని డాక్టర్‌ రాజేంద్ర బద్వే తెలిపారు. 
 
ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి, వైద్యులు ఎలుకలకు రెస్వెరాట్రాల్‌ ప్లస్‌ కాపర్‌కలిగిన ప్రో-ఆక్సిడెంట్‌ మాత్రలు ఇచ్చారు. అవి ఆక్సిజన్‌ రాడికల్‌లను ఉత్పత్తి చేసి, క్రోమాటిన్‌ కణాలను నాశనం చేసిందని ఆయన తెలిపారు. దాదాపు దశాబ్ద కాలంపాటు పరిశోధించి తయారు చేసిన ఈ మాత్రలను సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అమోదం కోసం వేచి చూస్తున్నామని ఆయన చెప్పారు. బహుశా జూన్‌-జులై నాటికి ఇది మార్కెట్లో అందుబాటులోకి రావచ్చని ఆయన తెలిపారు.