రమణ దీక్షితులుపై టీటీడీ వేటు

తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులును ఆ పదవి నుండి తొలగిస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్, టీటీడీ అధికారులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బోర్డులో చర్చించామని, తొలగించాలని బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించినట్లు భూమన తెలిపారు. త్వరలోనే ఉత్తర్వులు జారీ అవుతాయని చెప్పారు.
 
టీటీడీ, ప్రభుత్వం, అహోబిలం మఠం, అర్చకులు, జీయ్యర్లపై రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలపై పాలక మండలి సమావేశంలో చర్చించి ఆయనపై చర్యలకు నిర్ణయించినట్లు చెప్పారు. తిరుమలలో కొన్నేళ్లుగా అసాంఘిక కార్యకలపాలు జరుగుతున్నాయని, అన్యమతం విస్తృతంగా వ్యాపించిందని, నిధుల కోసం తవ్వకాలు జరుగుతాయి అంటూ రమణ దీక్షితులు మాట్లాడినట్లుగా ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. 
 
ఈవో ధర్మారెడ్డి క్రిస్టియన్, సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి క్రిస్టియన్ అని, టీటీడీలో చాలా మంది క్రిస్టియన్లు ఉండటమే పెద్ద సమస్య అని పేర్కొన్నారు. ఈవో కుమారుడు చనిపోతే దహనం చేయలేదని.. ఖననం చేశారని అంటూ టీటీడీపై, ఈవోపై రమణ దీక్షితులు వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.
గత నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ తిరుమలను సందర్శించిన సందర్భంగా రమణ దీక్షితులు చేసిన ట్విట్‌ సంచలనం రేపింది. తిరుమల ఆలయంలో సనాతన ధర్మాన్ని పాటించని ఓ అధికారి, ప్రాచీన సంప్రదాయాలు, నిర్మాణాలు, ఆస్తులను వ్యవస్థీకృతంగా నాశనం చేస్తున్నారని, దయచేసి ఆలయాన్ని కాపాడాలని కోరారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రమణ దీక్షితులును తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించింది.  గత టీడీపీ ప్రభుత్వంలో టీటీడీ అర్చకుల పదవీ విరమణపై మే 16 2018లో పాలక మండలిలో పదవీ విరమణ వయస్సును నిర్ణయించి, అది దాటిన వారిని పదవీ విరమణ చేయవలసిందిగా ఉత్తర్వులను జారీ చేసింది. అప్పుడు రమణ దీక్షితులతో పాటు పలువురు అర్చకులు ఉద్యోగాలను కోల్పోయారు.
 
అప్పుడు నలుగురు ప్రధాన అర్చకులతో పాటుగా మరి కొంత మంది అర్చకులు పదవీ విరమణ చేశారు. ఆ తరువాతి కాలంలో కూడా అదే అనవాయితీ కొనసాగింది. అయితే 2018లో టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా అర్చకులు కోర్టును ఆశ్రయించారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న అర్చకులను వయసు మళ్ళిన వారిని కూడా విధుల్లోకి తీసుకోవాలని కోర్టు తీర్పునిచ్చింది. 
 
అయితే వారు వయోభారం వల్ల స్వామి వారి కైంకర్యాలు చేయలేరనే ఉద్దేశంతో పాలకమండలి కోర్టు తీర్పును అమలు చేయలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక టీటీడీ పాలకమండలి ఆ అర్చకుల్ని తిరిగి విధుల్లోకి తీసుకుంది. హైకోర్టు తీర్పు మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. టిటిడి నిర్ణయంతో గతంలో రిటైర్ అయిన రమణ దీక్షితులు తిరిగి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు హోదాలో విధుల్లో చేరారు.