కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంకు లోక్‌సభ ఎన్నికల గండం!

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంకు లోక్‌సభ ఎన్నికల గండం!
కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుతాన్ని లోక్‌సభ ఎన్నికల గండం వెంటాడుతున్నది. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించలేకపోతే.. అది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నదని రాష్ట్ర పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. గత ఎన్నికలలో కేవలం ఒక స్థానం మాత్రమే గెలుపొందగా, మిగిలిన అన్ని స్థానాలను బిజెపి కైవసం చేసుకుంది. 
 
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న పలువురిని లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయించేందుకు హస్తం పార్టీ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అయితే ఇందుకు అమాత్యులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కర్ణాటక డిప్యూటీ సీఎం, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విందు సమావేశానికి కొంత మంది మంత్రులు డుమ్మా కొట్టడం ప్రాధాన్యం సంతరించుకొన్నది. 
 
మరి కొంత మంది మంత్రులు ఈ భేటీకి హాజరైనప్పటికీ, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు తమకు ఆసక్తి లేదని, ఎంపీగా తమ కుమారులకు టికెట్టు ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. డీకే ఏర్పాటు చేసిన ఈ విందు సమావేశానికి మంత్రులు హెచ్‌సీ మహదేవప్ప, సతీశ్‌ జార్కిహోళి, కేఎన్‌ రాజన్న, బైరటి సురేష్‌, సంతోష్‌, శరణ బసప్ప గైర్హాజరు అయ్యారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

డీకే విందు భేటీకి మాజీ కేంద్ర మంత్రి దిగ్విజయ్‌ సింగ్‌, కాంగ్రెస్‌ నేత అజయ్‌ మాకెన్‌ కూడా హాజరయ్యారు. లోక్‌సభ ఎన్నికలపై చర్చించామని, అభ్యర్థుల జాబితాను త్వరలో విడుదల చేయాల్సిన అవసరం ఉన్నదని హోంమంత్రి జీ పరమేశ్వర్‌ పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపికపై పార్టీ స్క్రీనింగ్‌ కమిటీ ఇప్పటికే పలు రౌండ్ల చర్చలు జరిపిందని, మరో భేటీ అనంతరం తుది జాబితా సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ వద్దకు వెళ్తుందని తెలిపారు.

సమావేశానికి హాజరైన మంత్రులతో సీఎం సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సంబంధిత లోక్‌సభ స్థానాలు, అభ్యర్థిత్వం అంశాలపై వేర్వేరుగా చర్చలు జరిపినట్టు సమాచారం. రాష్ట్రంలోని 28 లోక్‌సభ స్థానాలకు కనీసం 20 మందిని గెలిపించడం ద్వారా తమ పదవులను ఎన్నికల తర్వాత కూడా పదిలం చేసుకోవాలనే ఆలోచనలో వారిద్దరు ఉన్నారని కాంగ్రెస్‌ నేత ఒకరు పేర్కొన్నారు. 

కాగా, మంత్రి మహదేవప్పను చామరాజనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి పొటీచేయాలని సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ అంతకుముందు పట్టుబట్టినట్టు తెలిసింది. అయితే ఇందుకు విముఖత వ్యక్తం చేసిన మహదేవప్ప వారిద్దరికీ ఇటీవల వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. ‘సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరూ లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయాలి. ముఖ్యంగా రెండో వ్యక్తికి(డీకే) ఎక్కువగా అవకాశం ఉంటుంది’ అంటూ ఎద్దేవా చేశారు. ఇక పీడబ్ల్యూడీ మంత్రిగా ఉన్న సతీశ్‌ జార్కిహోళిని బెళగావి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయాలని రాష్ట్ర పార్టీ కోరినట్టు ప్రచారం జరుగుతున్నది.