హిందీ దిగ్గజ గాయకుడు పంకజ్ ఉధాస్

హిందీ దిగ్గజ గాయకుడు, గజల్ సింగర్ పంకజ్ ఉధాస్ (72) కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు. ‘చిట్టీ ఆయీ హై’తో పాటు అనేక చిరస్మరణీయమైన పాటలు పాడిన ఆయన మృతి చెందారు. పంకజ్ ఉధాస్ మరణించారని ఆయన కూతురు నయాబ్ వెల్లడిస్తూ ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు.

 “సుదీర్ఘ కాల ఆనారోగ్యంతో పద్మశ్రీ పంకజ్ ఉధాస్ 2024 ఫిబ్రవరి 24న చనిపోయారని భారమైన మనసు, బాధతో తెలియజేస్తున్నాం” అని నయాబ్ పోస్ట్ చేశారు. ముంబైలోని బీచ్ కాండీ ఆసుపత్రిలో ఉదయం 11 గంటలకు పంకజ్ ఉధాస్ తుదిశ్వాస విడిచారని తెలుస్తోంది. మంగళవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. భార్య ఫరిదా ఉధాస్, కూతుళ్లు రేవా ఉధాస్, సోదరులు నిర్మల్, మన్హర్ ఉధాస్‍తో ఆయన జీవిస్తూ ఉండేవారు.

పంకజ్ ఉధాస్ మరణ వార్త తెలుసుకొని చాలా మంది ప్రముఖులు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నివాళులు తెలుపుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. 1986లో వచ్చిన నామ్ చిత్రంలో చిట్టీ ఆయీ హై అనే పాటతో గాయకుడు పంకజ్ ఉధాస్ బాగా ఫేమస్ అయ్యారు. 

ఆ పాటలో ఆయన గాత్రం అందరినీ మైమరపించింది. ఏకే హీ మక్సద్ (1988) మూవీలో ‘చాందీ జైసా రంగ్ హై’, దేవన్ మూవీలో ‘ఆజ్ ఫిర్ తుంపే’ సహా ఆయన పాడిన చాలా పాటలు సూపర్ హిట్ అయ్యాయి. క్లాసిక్ పాటలుగా నిలిచాయి. ఆహాత్ (1980) సహా తన కెరీర్లో చాలా గజల్స్ పాడారు పంకజ్ ఉధాస్.గుజరాత్‌లోని జెట్‌పూర్‌ ప్రాంతంలో 1951 మే 17న ఆయన జన్మించారు. గజల్‌, నేపథ్య గాయకుడిగా గుర్తింపు పొందారు.

ఆయన హిందీ సినిమా, భారతీయ పాప్‌ రచనలకు మంచి గుర్తింపు వచ్చింది. 1980లో ఆహత్‌ అనే గజల్‌ ఆల్బమ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించారు. 1981లో ముకరర్‌, 1982లో తర్రన్నమ్‌, 1983లో మెV్‌ాఫిల్‌, 1984లో పంకజ్‌ ఉదాస్‌ లైవ్‌ ఎట్‌ రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌, 1985లో నయాబ్‌ వంటి అనేక హిట్‌లను రికార్డు చేశారు. 2006లో ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. 1970 నుంచి 2016 వరకూ పలు సినిమాల్లో పాటలు ఆలపించారు.