ఛత్తీస్‌గఢ్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి

* మందుపాతర ప్రేలి పోలీస్ మృతి

ఛత్తీస్‌గఢ్‌లో వరుసగా రెండో రోజూ మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. శనివారం సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ మావోయిస్టు చనిపోగా, తాజాగా మరో ముగ్గురు మృతిచెందారు. ఆదివారం ఉదయం కాంకేర్‌ జిల్లాలోలోని కోయలిబేడా అటవీ ప్రాంతంలో జిల్లా రిజర్వ్‌ గార్డ్స్‌, బీఎస్‌ఎఫ్‌ జవాన్లు గాలింపు చేపట్టగా మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. 

దీంతో ముగ్గురు మావోయిస్టులు మరణించారని జిల్లా ఎస్పీ ఇందిర కల్యాణ్‌ చెప్పారు. కోయలిబెడ పోలీసు స్టేషన్‌ పరిధిలో భోమ్రాాహుర్తరై గ్రామాలకు సమీపంలోని అటవీ ప్రాంతంలో డ్రిస్టిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్స్‌ (డిఆర్‌జి), సరిహద్దు భద్రత బలగాలు (బిఎస్‌ఎఫ్‌)కు చెందిన జవాన్లు మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌ నిర్వహిస్తుండగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నట్లు ఆయన చెప్పారు.

నక్సల్స్ ఏరివేతకు తరలిన భద్రతా బలగాల సంయుక్త దళానికి మావోయిస్టులకు మధ్య చాలా సేపు కాల్పులు జరిగాయని తెలిపారు.ఈ ప్రాంతంలో నక్సల్స్ ఉన్నారనే సమాచారంతో తమ బలగాలు అక్కడికి చేరుకున్నాయని ఎస్‌పి వివరించారు. కాల్పుల ఘటన తరువాత నక్సల్స్ సమీపంలోని దట్టమైన అడవుల్లోకి పారిపోయారు.

తరువాత గాలించగా అక్కడ ముగ్గురు నక్సల్ మృతదేహాలు పడి ఉన్నాయని గుర్తించారు. చనిపోయిన వారి పూర్వాపరాలను ఇప్పటికీ గుర్తించలేదని అధికారులు తెలిపారు.  ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను, పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. సుక్మా జిల్లాలోని బుర్కలంక అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, డిఆర్‌జి జవాన్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో శనివారం మావోయిస్టు ఒకరు చనిపోయిన సంగతి విదితమే.

మరోవంక, చత్తీస్‌గఢ్‌లో ఆదివారం నక్సల్స్ అమర్చిన మందుపాతర పేలిన ఘటనలో చత్తీస్‌గఢ్ సాయుధ బలగాలు (సిఎఎఫ్)కు చెందిన హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. బీజాపూర్ జిల్లాలో నక్సల్స్ ఈ ఐఇడిని అమర్చి గురి చూసి పేల్చినట్లు వెల్లడైంది. నక్సల్స్ ప్రభావిత జిల్లాలో బెచపల్ పదంపర గ్రామం వద్ద మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
సిఎఎఫ్ ఈ ప్రాంతంలో గాలింపులకు వస్తున్నాయని తెలియడంతో నక్సల్స్ ఈ మందుపాతరను అమర్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో నక్సల్స్ జాడ కోసం పెద్ద ఎత్తున గాలింపులు చేపట్టారు. ఇక్కడ అమర్చి ఉన్న ఐఇడిపై హెడ్ కానిస్టేబుల్ చూసుకోకుండా కాలు వేయడంతో అది పేలిందని వెల్లడైంది. ఈ పోలీసు జవాను మృతదేహాన్ని వెంటనే మిర్టూర్‌కు తరలించారు.