1వ తరగతిలో ప్రవేశానికి కనీస వయోపరిమితి

జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం 1వ తరగతిలో ప్రవేశానికి కనీస వయోపరిమితిని పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు.. అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఈ నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందేనంటూ రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలకు స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది.
1వ తరగతిలో ప్రవేశానికి పిల్లల వయస్సు కనీసం 6 సంవత్సరాలు నిండి ఉండాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలకు లేఖ రాసింది. 2020లో నూతన విద్యావిధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి అనేకసార్లు ఈ సూచనలు జారి చేసిన కేంద్రం ఇప్పుడు మరోసారి గుర్తు చేసింది. 
 
విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో మరోసారి కేంద్రం అప్రమత్తం  చేసింది. కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖ ప్రకారం 2024-25 కొత్త అకడమిక్ సెషన్‌కు అడ్మిషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. రాష్ట్రం/యూటీలో గ్రేడ్-1లో ప్రవేశానికి పిల్లల వయస్సు 6+ గా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. 
 
మార్చి 2022లో అస్సాం, గుజరాత్, పుదుచ్చేరి, తెలంగాణ, లడఖ్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హర్యానా, గోవా, జార్ఖండ్, కర్ణాటక, కేరళ సహా 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పిల్లలకు కనీసం 6 ఏళ్లు నిండి ఉంటేనే ఒకటవ తరగతిలో ప్రవేశం కల్పించాలని స్పష్టం చేసింది. ఎన్ ఇ పి 2020 5+3+3+4 పాఠశాల విధానం ప్రకారం, మొదటి ఐదు సంవత్సరాలలో మూడు నుండి ఆరు సంవత్సరాల వయస్సు గల వారికి సంబంధించిన మూడు సంవత్సరాల ప్రీస్కూల్, ఆరేళ్ల వయస్సు నుంచి ఎనిమిదేళ్ల వరకు రెండు సంవత్సరాల 1, 2 తరగతులు ఉంటాయి. ఈ సూచనల మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 1వ తరగతిలో ప్రవేశానికి కనీస వయోపరిమితి 6 సంవత్సరాలుగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.