మొదటి నెలలో అయోధ్య రాముడి వద్దకు 60 లక్షల మంది

ఉత్తరప్రదేశ్‌ అయోధ్యలోని బాల రాముడ్ని నెల రోజుల్లో సుమారు 60 లక్షల మంది భక్తులు దర్శించారు. అలాగే రూ.25 కోట్ల వరకు విరాళాలు, 25 కేజీల బంగారు, వెండి ఆభరణాలను సమర్పించారు. రామ మందిరం ట్రస్ట్‌ ఈ వివరాలను శనివారం వెల్లడించింది. 

అయోధ్యలో నిర్మించిన రామాలయంలో జనవరి 22న బాల రాముడి విగ్రహం ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ మరునాటి నుంచి ఆలయానికి భక్తులు పోటెత్తారు.  కాగా, జనవరి 23 నుంచి ఫిబ్రవరి 23 వరకు సుమారు 60 లక్షల మంది భక్తులు బాల రాముడ్ని దర్శించుకున్నట్లు రామ మందిరం ట్రస్ట్ కార్యాలయం ఇన్‌ఛార్జ్ ప్రకాష్ గుప్తా తెలిపారు. 

అలాగే ఒక నెలలో సుమారు రూ.25 కోట్ల విరాళాలు అందాయని చెప్పారు. హుండీలో కానుకలతోపాటు చెక్కులు, డ్రాఫ్ట్‌ల రూపంలో ఈ మేరకు విరాళాలు అందాయని అన్నారు. 25 కిలోల బంగారం, వెండి ఆభరణాలు కూడా భక్తులు సమర్పించినట్లు వెల్లడించారు. అయితే ట్రస్ట్ బ్యాంకు ఖాతాలలో భక్తులు నేరుగా జరిపిన ఆన్‌లైన్ లావాదేవీల వివరాల గురించి తెలియదని చెప్పారు.

మరోవైపు శ్రీరామ నవమి వేడుకల రోజుల్లో సుమారు 50 లక్షల మంది భక్తులు అయోధ్యకు రావచ్చని ట్రస్ట్‌ అధికారి ప్రకాష్ గుప్తా అంచనా వేశారు. దీంతో విరాళాలు కూడా భారీగా అందవచ్చని తెలిపారు. రసీదుల జారీకి కంప్యూటరైజ్డ్ కౌంటర్లతో పాటు ఆలయ ప్రాంగణంలో అదనపు హుండీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

భారీ మొత్తంలో అందే నగదు విరాళాల లెక్కింపు కోసం నాలుగు ఆటోమేటిక్ హైటెక్ కౌంటింగ్ మెషీన్లను ఎస్‌బీఐ ఏర్పాటు చేసిందని చెప్పారు. పెద్ద మొత్తంలో నగదు లెక్కింపు కోసం ఒక ప్రత్యేక గదిని త్వరలో నిర్మించనున్నట్లు వెల్లడించారు. అలాగే భక్తులు సమర్పించిన బంగారు, వెండి ఆభరణాల నిర్వహణ, కరిగించడం వంటివి భారత ప్రభుత్వ మింట్‌కు అప్పగించినట్లు వివరించారు.