యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష రద్దు

ఫిబ్రవరి 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పోలీస్‌ కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షకు సంబంధించిన పేపర్‌ లీక్‌ కావడంతో ఆ పరీక్షను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ శనివారం ప్రకటించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.

 ‘యుపి పోలీస్‌ కానిస్టేబుల్‌ సివిల్‌ పోలీసు పరీక్షలు 2023 రద్దయ్యాయి. వచ్చే ఆరు నెలల్లో పరీక్షలను తిరిగి నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చాము. పేపర్‌ లికేజీలో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము.’ అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. ఇక పేపర్‌ లీకేజీకి గల కారణాలను పరిశోధించాలని యుపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ ఉద్యోగులైన రివ్యూ ఆఫీసర్‌/ అసిస్టెంట్‌ రివ్యూ ఆఫీసర్‌ (ఆర్‌వో/ఎఆర్‌వో) స్థాయిలో కూడా పరిశోధించాలని యుపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  అభ్యర్థులు ఫిబ్రవరి 27 వరకు @secyappoint@nic.in ఫిర్యాదు చేయవచ్చు.  కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షలో ఆరోపించిన రిగ్గింగ్‌పై పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు కూడా దర్యాప్తు చేస్తోంది అని యుపి ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

పేపర్‌ లీక్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. రోజుకు రెండు షిఫ్టుల్లో రెండు రోజులపాటు జరిగిన ఈ పరీక్షకు సంబంధించి పేపర్‌ లీక్‌ అయ్యినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్‌ చేశారు. దీని కోసం కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నారు. ‘పరీక్షల పవిత్రలో ఎలాంటి రాజీ ఉండదు. యువత కష్టార్జితంతో ఆడుకున్న వారిని వదిలిపెట్టబోం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.

దీంతో ఆందోళన చేస్తున్న అభ్యర్థులు పరీక్ష రద్దు నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 60,244 కానిస్టేబుల్ ఉద్యోగాలకు దాదాపు 48 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఈ పరీక్ష సందర్భంగా అవకతకవలకు పాల్పడ్డారన్న ఆరోపణపై 244 మందిని అరెస్టు చేశారు.