తిరిగి ఎన్నికైన 12 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు

2004 నుంచి 2019 మధ్య తిరిగి ఎన్నికైన 23 మంది ఎంపిల్లో 12 మందిపై క్రిమినల్‌ కేసులున్నాయని ఎన్నికల సంబంధిత డేటాను విశ్లేషించే సంస్థ   ‘అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌’ (ఎడిఆర్‌)   శుక్రవారం వెల్లడించింది.   ఈ 12 మందిలో తొమ్మిది మంది ఎంపిలపై హత్య, హత్యాయత్నం, దోపిడీ సహా తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నాయని పేర్కొంది. 

 2004-2019 మధ్య అభ్యర్థుల ఎన్నికల అఫిడవిట్‌లను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించినట్లు తెలిపింది. జాబితాలో చేర్చబడిన 23 మంది ఎంపిలలో 52 శాతం మంది తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని, 39 శాతం మంది ఎంపిలపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. పార్టీల వారీగా గణాంకాలను కూడా ఈ నివేదికలో సమర్పించారు.

బిజెపికి తిరిగి ఎన్నికైన 17 మంది ఎంపిలలో ఏడుగురు (41 శాతం), ముగ్గురు కాంగ్రెస్‌ (100 శాతం) ఎంపిలు క్రిమినల్‌ కేసులను ఎదుర్కొంటున్నారు. ఆల్‌ ఇండియా మజ్లిస్‌-ఇ-ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) నుండి ఎన్నికైన ఒకరు, శివసేనకు చెందిన ఓ ఎంపిలు తమపై ఉన్న క్రిమినల్‌ కేసులను అఫిడవిట్‌లో ప్రకటించారు.

తిరిగి ఎన్నికైన ఎంపిలలో నలుగురు తమ విద్యార్హతలను 10వ తరగతి, 12వ తరగతి మధ్య ఉన్నట్లు ప్రకటించగా, 18 మంది గ్రాడ్యుయేషన్‌, అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉన్నట్లు తెలిపారు. వారిలో ఒకరు డిప్లోమా హోల్డర్‌ అని ప్రకటించారు. ఈ  ఎంపిలలో 19 మంది వయస్సు 51 నుండి 80 సంవత్సరాల  మధ్య ఉండగా, నలుగురి వయస్సు  40 నుండి 50 ఏళ్ల మధ్య ఉంది.  తిరిగి ఎన్నికైన 23 మంది ఎంపిలలో కేవలం ముగ్గురు మాత్రమే మహిళలు ఉన్నారు.

2004లో ఈ ఎంపిల సగటు ఆస్తి విలువ రూ.1.52 కోట్లు ఉండగా, 2009 నాటికి రూ.3.46 కోట్లుకి చేరుకుంది. 2014లో రూ.9.85 కోట్లు, 2019లో రూ.17.51 కోట్లకు చేరుకున్నట్లు నివేదిక తెలిపింది. 2004 నుండి 2019 మధ్య వీరి సగటు ఆస్తి వృద్ధి రేటు రూ.15.98 కోట్లుగా ఉంది.